12-01-2026 12:00:00 AM
చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం
మొయినాబాద్, జనవరి 11 (విజయ క్రాంతి): ఎవరికి ఎంత ధనం ఉన్నా ప్రజలకు సేవ చేసే గుణం ఉండాలని చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం అన్నారు. మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సురంగల్ గ్రామానికి చెందిన యువ నాయకుడు గుమ్మళ్ల సీతారాం రెడ్డి, ఆయన సోదరుడు గుమ్మళ్ల విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో మెడివిజన్ కంటి దవాఖాన సౌజన్యంతో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 200 మందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచిత కంటి అద్దాలు పంపిణీ చేశారు.
అలాగే ఒక సంవత్సరం నుంచి పది సంవత్సరాల లోపు వయస్సు ఉన్న ఆడపిల్లలకు సుకన్య సమృద్ధి యోజన పథకం కింద పోస్టాఫీస్లో ఖాతాలు తెరిచి, ప్రతి ఖాతాలో దఫాల వారిగా రూ.10 వేల చొప్పున జమ చేయడానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం చేతుల మీదుగా కంటి అద్దాల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిన్న వయస్సులోనే రాజకీయాల్లోకి వచ్చి అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న గుమ్మళ్ల సీతారాం రెడ్డి గొప్ప మనసున్న యువ నాయకుడని ప్రశంసించారు.
గ్రామంలో రైతులకు స్ప్రే పంపులు పంపిణీ చేయడం, వృద్ధులు, వికలాంగులకు స్టాండ్లు, నడుము బెల్టులు అందించడం, నిరుద్యోగ మహిళలకు ఉచితంగా మగ్గం వర్క్ శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు పంపిణీ చేయడం వంటి సేవా కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. యువతను క్రీడా రంగం వైపు మళ్లించేందుకు క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహించి క్రీడాస్ఫూర్తిని పెంచుతున్నారని తెలిపారు. పేదలకు ఉచితంగా కంటి పరీక్షలు చేసి కంటి అద్దాలు అందించడం, ఆడపిల్లల భవిష్యత్తు కోసం సుకన్య సమృద్ధి యోజన పథకం కింద ఖాతాలు ప్రారంభించి ఆర్థిక భరోసా కల్పించడం మంచి పరిణామమని పేర్కొన్నారు.
చాలా మందికి ధనం ఉన్నా దానం చేసే గుణం ఉండదని, యువత సేవా భావనను పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కంజర్ల ప్రకాశ్, ఎస్. ప్రభాకర్ రెడ్డి, గున్నాల గోపాల్ రెడ్డి, పద్మనాభం, ఎం. శ్రీకాంత్, డి. చంద్రశేఖర్ రెడ్డి, వెంకట రెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి, శ్రీనివాస్, నరేందర్, ప్రభు యాదవ్, బొర్ర జగన్, ప్రశాంత్ గౌడ్, కె. నారాయణ రెడ్డి, మధుసూదన్ గౌడ్, కె. బాలరాజ్, ఆర్. గిరిబాబు, బి. సందీప్, కె. కన్న, విజయ్ గౌడ్, ఆర్. రాజు, విజయ్ పాండు యాదవ్, శంభు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.