calender_icon.png 4 May, 2025 | 4:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎండ తీవ్రతకు గురికాకుండా జాగ్రతలు పాటిద్దాం

03-05-2025 04:20:26 PM

మానుకోట జిల్లా వైద్యాధికారి డాక్టర్ రవి రాథోడ్...

మహబూబాబాద్ (విజయక్రాంతి): ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోందని, వేసవి కాలంలో తీవ్రమైన ఎండ, వేడి గాలులు వీచినప్పుడు ‘వడదెబ్బ’కు గురయ్యే అవకాశం కలదని ప్రజలందరూ తగిన జాగ్రతలు తీసుకోవాలని మహబూబాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ రవి రాథోడ్ తెలిపారు. 

ఎండ దెబ్బ లక్షణాలు

వేసవికాలంలో వడ దెబ్బకు గురైనప్పుడు ముఖ్యంగా  శరీర ఉష్ణోగ్రత తీవ్రంగా పెరగడం, తీవ్రమైన తలనొప్పి, నాలుక ఎండి పోవడం, శరీరంలో నీటి శాతం తగ్గడం, మూత్రం గాఢ పసుపు రంగులో ఉండి మంట రావడం, పాక్షిక లేదా పూర్తి అపస్మారక స్థితిలోకి వెళ్ళే అన్ని లక్షణాలు గాని లేక కొన్ని లక్షణాలు గాని కనిపిస్తాయని పేర్కొన్నారు.  

ప్రథమ చికిత్స

వడదెబ్బకు గురైన వ్యక్తిని వెంటనే నీడ గల ప్రదేశానికి చేర్చాలి. శరీరాన్ని చల్లని నీటిలో ముంచిన గుడ్డతో తుడవాలి. ఎండ దెబ్బ తగిలిన వారికి ఉప్పు కలిపిన మజ్జిగ, కొబ్బరినీళ్లు, నిమ్మరసం, గ్లూకోజు, పప్పుకట్టు, ఓఆర్ఎస్  ద్రావణాన్ని త్రాగించాలి. సత్వర చర్యల కొరకు 108 అత్యవసర సేవలను సంప్రదించాలి. ప్రథమ చికిత్స చేసిన తరువాత దగ్గరలో గల ఆరోగ్య కేంద్రం/ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాలని తెలిపారు.

జాగ్రత్తలు

వడ దెబ్బ తగలకుండా ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు బయట తిరగడం/ఆడటం చేయరాదు. తప్పనిసరి పరిస్థితులలో ఎండలోకి వెళితే గొడుగు, టోపీ, తెల్లని రుమాలు తప్పక ధరించాలి. తెల్లని వదులైన నూలు వస్త్రాలు ధరించాలి. నీరు, ఇతర ద్రవ పదార్థాలు వీలైనంత ఎక్కువగా తీసుకోవాలి. మత్తు పానీయాలు తీసుకోరాదు. ముఖ్యంగా ఇంటివద్ద వుండే పిల్లలు, 60 సం.ల. పై బడిన వారు, అనారోగ్యంతో బాధపడేవారు తరచుగా మంచి నీరును, ఓఆర్ఎస్ ను త్రాగలని, ఒకవేళ నోరు ఎండుకపోవడం, దాహం వేయడం లక్షణాలు వుంటే దగ్గరలోని ఆశా కార్యకర్తను సంప్రదించాలని తెలిపారు. అలాగే బయట పనికి వెళ్ళేవారు ఉదయం 12 గంటలలోపు, సాయంత్రం 4 గంటల తదుపరి పనిచేసుకొవాలని, మధ్యాహ్నం విశ్రాంతి తీసుకోవాలన్నారు.

ప్రతి ఆరోగ్య కేంద్రం, ఉప కేంద్రం, ఆశా కార్యకర్త, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రులు, గ్రామ పంచాయతీలలో ఉచితంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయని, అవసరం ఉన్నవారు తీసుకెళ్లాలని కోరారు. ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తూ వడ దెబ్బకు గురి కాకుండా చూసుకోవాలని తెలిపారు. అంతే కాకుండా వేసవి కాలంలో వచ్చే వ్యాధులపై పర్యవేక్షణకు జిల్లా స్థాయిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయిలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ లను ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు.