19-06-2024 12:05:00 AM
దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు బాగా పెరిగిపోయాయి. ప్రతి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరు వేలకు పైగా సైబర్ నేరాలు నమోదవుతున్నాయి. కనీసం రూ. పది కోట్ల నుండి నలభై కోట్ల వరకు నష్టపోతున్నారు. ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎయిమ్స్, సఫ్దర్‌జంగ్ హాస్పిటల్ మొదలుకొని రాష్ట్ర సంస్థలపై సైబర్ దాడులకు సంబంధించిన వార్తలు నిత్యం వింటూనే ఉన్నాం. వార్తల్లోకి రానివి కోకొల్లలు. ప్రస్తుతం మనం సైబర్ కాలంలో జీవిస్తున్నాం.
మన కార్యకలాపాలు అన్నింటిలోను డిజిటల్ సాంకేతికతలు సాయం చేస్తున్నాయి. ప్రత్యేకించి కోవిడ్ నేపథ్యంలో అన్ని రంగాలు డిజిటల్ మాధ్యమంపై ఆధారపడడాన్ని గమనిస్తున్నాం. దీంతో సైబర్ సెక్యూరిటీ కీలకమైందిగా మారింది. సైబర్ క్రిమినల్స్, మోసగాళ్ళు, హ్యాకర్స్ బారినుంచి డేటాను, నెట్‌వర్క్‌లను, సిస్టమ్స్‌ను, వ్యక్తిగత గోప్యతను కాపాడుకోవాలంటే సైబర్ సెక్యూరిటీ ఎంతో అవసరమైందిగా మారిపోయింది. సమాజంలో అన్ని రంగాలు, వర్గాలకు చెందిన డిజిటల్ యూజర్లు సైబర్ దాడులు ఏయే రకంగా జరుగుతూ ఉంటాయనేది తెలుసుకోవడం ముఖ్యం.
అలాగే, వాటిని వారు కాపాడుకోవడానికి భద్రమైన ఆన్‌లైన్ అభ్యాసాల గురించిన అవగాహనను కూడా ఏర్పరచుకోవలసి ఉంది. అంతేకాదు, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ సిఫారసు చేసిన మేరకు దేశంలో సైబర్ సంబంధిత దృఢత్వాన్ని కూడా పెంచుకోవలసి ఉంది.
భద్రతలో డొల్లతనం
సైబర్ సెక్యూరిటీ విషయంలో జాగృతిని వ్యాప్తి చేయాలనే ఆలోచన మన ప్రభుత్వాలకు లేదనిపిస్తుంది. భద్రతలో డొల్లతనం, అధికారుల నిర్లిప్తత సామాన్య ప్రజలకు కంటకంగా మారింది. నగదు లేకుండా డబ్బులు చెల్లించుకునే ప్రక్రియ మీద అవగాహన కోసం కేంద్ర ప్రభుత్వం భారీగా కసరత్తు చేస్తోందన్న ప్రచారం జరుగుతోంది. కానీ, ప్రజలకు సైబర్ సెక్యూరిటీపై అవగాహన లేక భారీగా నష్టపోతున్నారు. బ్యాంకుల వెబ్‌సైట్‌ల మీద సైబర్ దాడులు, డెబిట్ కార్డ్ మోసాలు, సర్వర్లలోకి అనధికార యాక్సిస్‌లూ జరుగుతూ ఉండడం సర్వ సాధారణమైంది. వాటిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలి.
సైబర్ సెక్యూరిటీ పరంగా ఎలాంటి సంఘటన జరిగినా బ్యాంకులు ఆర్బీఐకి రెండు నుంచి ఆరు గంటల్లోగా సమాచారం అందించాలని ఆదేశాలు జారీ చేసినా వాటిని బుట్టదాఖలు చేస్తున్నారు. సకాలానికి రిపోర్ట్ చేయకపోయినా, రుణ మోసాలను కప్పి పుచ్చేందుకు ప్రయత్నించినా బ్యాంకర్లపై క్రిమినల్ చర్యలు చేపట్టాలి. ప్రతి రోజూ లక్షా ఎనభై వేల ఫేస్‌బుక్ అకౌంట్లు హ్యాక్ అవుతున్నట్లు అంచనా. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో ఎక్కువమంది మోసపోతున్నారు.
వారిలో బాగా చదువుకున్న వాళ్లూ ఉంటున్నారు. ‘ఎప్పుడో మీరొక పాలసీ చేశారు మీరు ఆ పాలసీ ఆరు సంవత్సరాల క్రితం విత్ డ్రా చేసుకున్నారు. కానీ, ఇంకా ఆ పాలసీ క్లోజ్ కాలేదు. కొంత సొమ్ము అలాగే ఉండి పోయింది. మీ ఖాతా వివరాలు, ఆధార్ నంబర్, పాన్ నంబరు తదితర వివరాలు పంపండి. అలాగే, నామినేషన్ వివరాలు కూడా పంపండి ..’ ఇలా పక్కా ప్రణాళికతో బురిడీ కొట్టించే ‘మేధావులు’న్నారు.
ఎన్నో రకాల నేరాలు
ఈ మధ్యకాలంలో ప్రతి నిత్యం ప్రతి చోటా కంప్యూటర్‌ను సాధనంగా చేసుకుని లేదా తదుపరి నేరాలకు పాల్పడే మార్గంగా ఉపయోగించే అన్ని రకాల నేరపూరిత చర్యలు సైబర్ నేరాల కిందకు వస్తాయి. కంప్యూటర్ ద్వారా మోసాలకు పాల్పడటం లేదా టెక్నాలజీని ఉపయోగించి కంప్యూటర్లపై దాడి చేయడం.. ఈ రెండూ చట్టవిరుద్ధమైన చర్యలే. సైబర్ క్రైమ్ అనేది కంప్యూటర్ ఆధారిత నేరం. కంప్యూటర్, కంప్యూటర్ నెట్‌వర్క్, నెట్‌వర్క్ డివైజ్‌లే లక్ష్యంగా చేసే దాడి లేదా నేర పూరిత చర్యను ‘సైబర్ క్రైమ్’ అంటారు.
అక్రమంగా డబ్బు సంపాదించాలనుకునే సైబర్ నేరగాళ్లు, హ్యాకర్లు ఇలాంటి నేరాలకు పాల్పడతారు. వ్యక్తులు లేదా సంస్థలు ఒక ప్రణాళిక ప్రకారం ఉమ్మడి లక్ష్యం కోసం ఇలాంటి మోసాలు చేయాలనుకుంటారు. ఒక వ్యక్తి, సంస్థ లేదా దేశ రక్షణకు, ఫైనాన్షియల్ హెల్త్‌కు సైబర్ నేరాలు ఆటంకం కలిగిస్తాయి. ఇలాంటి చర్యలు చట్ట వ్యతిరేకమైనవి. భారత్‌తోపాటు ప్రపంచ దేశాలు సైబర్ నేరాలకు కఠినమైన శిక్షలు విధిస్తున్నాయి.
కంప్యూటర్ సిస్టమ్స్ లేదా నెట్‌వర్క్‌లను అక్రమంగా, అనధికారంగా యాక్సెస్ చేయడం లేదా హ్యాకింగ్ చేయడం, ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్న సమాచారాన్ని దొంగిలించడం, ఈ మెయిల్ బాంబింగ్, సలామి ఎటాక్, సర్వీస్ ఎటాక్‌ను అడ్డుకోవడం, వైరస్ లేదా వార్మ్ దాడులు, లాజిక్ బాంబ్స్, ఇంటర్నెట్ టైమ్ థెఫ్ట్స్ వంటివన్నీ వివిధ రూపాల్లో ఉండే సైబర్ నేరాలు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే సైబర్ టె్రర్రరిజం, వ్యక్తులను లక్ష్యంగా చేసుకునే సైబర్ పోర్నోగ్రఫీ, సైబర్ స్టాకింగ్, సైబర్ డిఫమేషన్.. ఆస్తులను లక్ష్యంగా చేసుకునే ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్, మేధో సంపత్తి హక్కుల ఉల్లంఘన, ఫిషింగ్, క్రెడిట్ కార్డు మోసాలు వంటివి.. వివిధ రకాల సైబర్ నేరాలు.
‘ఐపి స్పూఫింగ్’ అంటే?
కంప్యూటర్లను అనధికారంగా, మోసపూరితంగా యాక్సెస్ చేసేందుకు ఈ టెక్నాలజీని నేరగాళ్లు ఉపయోగిస్తారు. ఈ పద్ధతిలో చొరబాటుదారులు ఐపి హోస్ట్ ఉన్న కంప్యూటర్‌కు కొన్ని రకాల మెస్సేజ్‌లను పంపుతారు. అది ట్రస్ట్ హోస్ట్ నుంచి వస్తున్నట్లు నమ్మిస్తారు. దీనిద్వారా సిస్టమ్‌ను తమ అధీనంలోకి తీసుకుంటారు. వినియోగదారుని పేరు, పాస్‌వర్డ్, క్రెడిట్ కార్డ్ వివరాలు వంటి సున్నితమైన సమాచారాన్ని దొంగిలించడానికి చేసే నేరం, మోసపూరిత చర్యను ‘ఫిషింగ్’ అంటారు. విశ్వసనీయ సంస్థగా లేదా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్‌లోని వ్యక్తిగా మారు వేషాల ద్వారా ఈ మోసాలకు పాల్పడతారు.
చట్టాలు ఉన్నాయి కానీ..
దేశంలో సైబర్ క్రైమ్‌లో దొంగతనం, మోసం, ఫోర్జరీ, పరువు నష్టం, అల్లర్లు వంటి నేర కార్యకలాపాలు నియంత్రించే చట్టాలు ఉన్నాయి. కానీ, అవి సమర్థవంతంగా అమలు కావడం లేదు. వీటన్నింటికీ ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) ప్రకారం శిక్షలు విధిస్తారు. ‘ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2000’ కింద అన్ని రకాల సైబర్ నేరాలకు శిక్షలు అమల్లో ఉన్నాయి. వీటిని నిరోధించే వ్యక్తులు, అలాగే సైబర్ చట్టం గురించి కనీస అవగాహన మన సంరక్షకుల కు లేకపోవడం దురదృష్టకరం. ఏ సెక్షన్ వర్తిసుందో స్టేషన్ హౌస్ ఆఫీసరుకు, జిల్లా స్థాయి అధికారులకూ తెలియని పరిస్థితి. సైబర్ చట్టం అమలుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పోలీసు, న్యాయ అధికారులు, రెవెన్యూ అధికారులు, ఆర్థిక రంగాల్లో పనిచేసే వ్యక్తులకు అవగాహన శిబిరాలు, పునశ్చరణ తరగతులు నిర్వహించాలి.
ఇంటర్నెట్ వంటి ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా వేధింపులకు గురి చేయడా నికి ‘సైబర్ స్టాకింగ్’ అంటారు. ఆస్తులు లక్ష్యంగా చేసుకుని జరిపే దాడులను ‘ఆర్థిక నేరాలు’ అంటారు. ఆస్తిపై హక్కును, ఓనర్‌షిప్‌ను అక్రమంగా మార్చుకోవడం, చట్ట విరుద్ధంగా ఒకరి వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతీయడం వంటివన్నీ ఈ జాబితాలో ఉంటాయి. సోషల్ ఇంజినీరింగ్ పద్ధతులు లేదా ఫిషింగ్ వంటి అధునాతన సాంకేతిక పద్ధతులు ఉపయోగించడం ద్వారా మోసగాళ్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్యాంక్ అకౌంట్లలో డబ్బు దోచుకోగలరు.
ఎవరికి ఫిర్యాదు చేయాలి?
సైబర్ దాడులకు గురైన వారు సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సెల్‌కు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. బాధితుల పేరు, మెయిలింగ్ అడ్రస్, ఇతర వివరాలను ఫిర్యాదులో పేర్కొనాలి. నేరం ఎలా జరిగిందనే అంశాన్ని రిపోర్టులో పూర్తిగా నమోదు చేయాలి. అత్యవసరమైతే స్థానిక పోలీస్ స్టేషన్‌ను సంప్రదించవచ్చు. ఇంటర్నెట్, నెట్ బ్యాంకింగ్, ఆన్‌లైన్ మార్కెటింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరు జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం ఆర్థిక నేరాలు, సైబర్ నేరాలను ప్రచారం చేసి ప్రజలలో అవగాహన పెంచి నేరాలను అరికట్టాలి. అలాగే, ఇలాంటి నేరాలకు బహుళ ప్రాచుర్యం కలిగించాలి. సైబర్ నేరగాళ్ల ద్వారా నష్టపోయిన వారు 155260 టోల్ ఫ్రీ నంబరుకు నేరం జరిగిన 48 గంటలలోపు తెలియపరిస్తే కొంతమేరకు నష్ట నివారణ చేయవచ్చు.
డా.యం. సురేష్‌బాబు
అధ్యక్షులు, ప్రజాసైన్స్ వేదిక