calender_icon.png 20 August, 2025 | 2:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముదిరిన నీట్ వివాదం

19-06-2024 12:05:00 AM

నీట్ పరీక్ష వివాదం రోజురోజుకూ ముదిరి రాజకీయ మలుపు తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు రోడ్డెక్కితే ప్రతిపక్షాలు వారికి మద్దతుగా నిరసన గళం వినిపిస్తున్నాయి. నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని, ఈ పరీక్షను రద్దు చేయాలంటూ ప్రతిపక్ష ‘ఇండియా’ పార్టీలన్నీ ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. పరీక్ష నిర్వహించిన ‘నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ’ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. మంగళవారం ఢిల్లీలో ‘ఆమ్‌ఆద్మీ’ పార్టీ భారీ ధర్నా నిర్వహిస్తే హైదరాబాద్‌లో విద్యార్థి సంఘాలు రోడ్డెక్కాయి.

వేలాదిమందితో భారీర్యాలీ నిర్వహించాయి. మరోవైపు ఈ వ్యవహారంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పరీక్ష నిర్వహణలో తప్పులు జరిగి ఉంటే అంగీకరించి వాటిని సరిదిద్దుకోవాలని, నీట్ పరీక్ష నిర్వహించిన ఏజన్సీకి సలహా ఇచ్చింది. 0.001 శాతం నిర్లక్ష్యం ఉన్నా సమగ్రమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. వ్యవస్థను మోసం చేసిన వ్యక్తి డాక్టర్ అయితే సమాజానికి ఎంత నష్టమో ఆలోచించాలని కూడా వ్యాఖ్యానించింది. దీనిపై రెండు వారాల్లోగా సమాధానం చెప్పాలంటూ కేంద్రానికి, ఎన్‌టీఏను ఆదేశిస్తూ, తదునరి విచారణను వాయిదా వేసింది.

నీట్ పరీక్షా పత్రం లీకయినట్లు, లీక్ చేసిన బీహారీ ముఠా ఒక్కో విద్యార్థి నుంచి రూ.30 లక్షలు తీసుకున్నట్లు తేలినా ప్రధాని మోడీ ఈ వ్యవహారంపై ఎందుకు మౌనంగా ఉన్నారని కాంగ్రెస్ నేత రాహుల్ డిమాండ్ చేశారు. బీజేపీ, ఆ కూటమి భాగస్వామ్య పక్షాల పాలిత రాష్ట్రాలైన బీహార్, గుజరాత్, హర్యానాలలో జరిగిన అరెస్టులు ఈ పరీక్షలో అవినీతి జరిగిందని  రుజువు చేస్తున్నాయని అన్నారు. 24 లక్షలమందికి పైగా విద్యార్థుల భవిష్యత్తు తారుమారు అయినా ప్రధాని ఏమీ పట్టనట్లుగా ఎప్పటిలాగే మౌనం వహిస్తున్నారని మండి పడ్డారు.  మరోవైపు నీట్ పరీక్ష నిర్వహణలో కొన్ని తప్పులు జరిగాయని కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అంగీకరిస్తూనే, సుప్రీంకోర్టు ఏం ఆదేశిస్తే దాని ప్రకారం నడుచుకుంటామని చెప్పారు.

ఈ ఏడాది నీట్ పరీక్ష నిర్వహణలో వివాదం ఏమిటి? మే 5న ఈ పరీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా 24 లక్షలమందికి పైగా అభ్యర్థులు పరీక్ష రాశారు. ఆ సమయంలో పేపర్ లీకయిందన్న ఆరోపణలు వచ్చాయి. అయితే, వాటిని అటు ఎన్‌టిఏ, ఇటు కేంద్ర ప్రభుత్వం తోసి పుచ్చాయి. జూన్ 15న ఫలితాలను వెల్లడిస్తామని చెప్పిన ఎన్‌టీఏ పది రోజుల ముందే ఎలాంటి ముందస్తు ప్రకటనా లేకుండా ఫలితాలను ప్రకటించింది. దేశమంతా లోక్‌సభ ఎన్నికల ఫలితాల కోసం టీవీ సెట్లకు అతుక్కుపోయిన సమయంలో (జూన్ 4న) వెలువడిన ఈ ఫలితాలను చూసి అందరూ నివ్వెరపోయారు.

ఫలితాల్లో ఏకంగా 67 మందికి 720 మార్కులకు 720 మార్కులు వచ్చాయి. అందులో బీహార్‌లోని ఓ కేంద్రంలో పరీక్ష రాసిన ఆరుగురు ఉన్నారు. దీంతో అనుమానం వచ్చిన బీహార్ పోలీసులు దర్యాప్తు చేపట్టడంతో పేపర్ లీక్ వ్యవహారం బైటికి వచ్చింది. ఒక్కో అభ్యర్థి నుంచి రూ.30 లక్షలకు పైగా వసూలు చేసిన బీహారీ గ్యాంగ్ ఒకరోజు ముందే ప్రశ్నపత్రాన్ని వాళ్లకు అందించినట్లు తేలింది. విచిత్రంగా కొంతమందికి 718, 719 మార్కులు కూడా వచ్చాయి. సాధారణంగా ఒక సమాధానం తప్పయితే అయిదు మార్కులు తగ్గుతాయి. కానీ, కొందరికి ఒకటి రెండు మార్కులు మాత్రమే తగ్గడం అనుమానాలకు తావిస్తోంది.

అవి గ్రేస్ మార్కులంటూ ఎన్‌టీఏ సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చింది. సాంకేతిక కారణాలవల్ల 1,563 మందికి ఇచ్చిన గ్రేస్ మార్కులను రద్దు చేసి, వాళ్లకు ఈ నెల 23న మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని సర్వోన్నత న్యాయస్థానానికి ఎన్‌టీఏ తెలియజేసింది. విద్యా సంవత్సరం నష్టపోకుండా చూస్తామనీ హామీ ఇచ్చింది. కాగా, 24 లక్షలమంది అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కౌన్సెలింగ్ నిలిపి వేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించడం ఈ మొత్తం వ్యవహారంలో ఓ శుభ పరిణామం. కానీ, ఈ వివాదానికి శుభం కార్డు పడేది ఎప్పుడనేది అందరినీ వేధిస్తున్న ప్రశ్న.