calender_icon.png 25 August, 2025 | 4:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధ్యాయ ఉద్యోగ సమస్యలను పరిష్కరిస్తాం

25-08-2025 02:14:56 AM

-గత ప్రభుత్వ విధానాల వల్లే ఆర్థిక సమస్యలు 

-ఉద్యోగులు కూడా అర్థం చేసుకోవాలి

- పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క

హైదరాబాద్, ఆగస్టు 24 (విజయక్రాంతి): ఉపాధ్యాయ, ఉద్యోగ సమస్యలను పరిష్కరిస్తామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ అస్తవ్యస్త విధానాల వల్లే ఆర్థిక సమస్యలు తలెత్తాయని, ఉద్యోగులు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం అబిడ్స్‌లోని స్టాన్లీ స్కూల్‌లో ఎస్టీయూటీఎస్ రాష్ర్ట అధ్యక్షుడు మాడుగుల పర్వత్‌రెడ్డి ఉద్యోగ విరమణ అభినందన సభలో మంత్రి సీతక్క మాట్లాడారు.

పర్వత్‌రెడ్డి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పటికీ ఉద్యమకారుడిగా కూడా పేరుపొందారని, ఆయన జీవితం ఉపాధ్యాయులందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. రాష్ర్టంలో తొలి ఉపాధ్యాయ సంఘంగా ఏర్పడిన ఎస్టీయూ ప్రభుత్వ విద్య బలోపేతం కోసం కృషి చేసిందని, ఎందరో మహనీయులు ఈ సంఘం ద్వారా సమాజానికి సేవలందించారని గుర్తుచేశారు. మాజీ ఉపరాష్ర్టపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ కూడా ఈ సంఘ సదస్సులకు హాజరయ్యారని తెలిపారు. ఎన్నో కష్టాలు ఎదురైనా ఉపాధ్యాయులు విద్యా సమస్యలతో పాటు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేశారని అన్నారు. ఉపాధ్యాయ వృత్తి కంటే గొప్ప వృత్తి మరొకటి లేదని, భారతదేశ భవిష్యత్తును నిర్మించే పవిత్ర వృత్తి ఇదేనని పేర్కొన్నారు. 

 ఆందోళన చెందవద్దు

ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం సీఎం ఇప్పటికే సంఘాలతో సమావేశం అయ్యారని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. గత ప్రభుత్వాల విధానాల కారణంగా ఆర్థిక సమస్యలు తలెత్తాయని, అందువల్ల కొంత ఆలస్యం జరుగుతున్నా సమస్యలను పరిష్కరించడానికి కృషి జరుగుతోందని తెలిపారు.

గత ప్రభుత్వంలో ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందలేదని, బదిలీలు పదోన్నతులు లేక ఉపాధ్యాయులు నష్టపోయారని, ఆ నష్టాన్ని పూరించేందుకు ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఉపాధ్యాయ, ఉద్యోగ, విద్యార్థి, కార్మికులు కర్షకులు కలిసి ఏర్పాటు చేసుకున్న ప్రజాప్రభుత్వం ఆయా వర్గాలకు అండగా ఉంటుందని తెలిపారు. ఎమ్మెల్సీ కోదండరాంతో కలిసి ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తాను కృషి చేస్తానని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ కోదండరాం, మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పర్వత్‌రెడ్డి దంపతులను మంత్రి సీతక్క ఘనంగా సన్మానించారు.