12-08-2025 12:00:00 AM
కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 11(విజయ క్రాంతి): చేనేత వస్త్రాలు ధరించి చేనేత కార్మికులను ప్రోత్సహించుదామని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. 11వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన బెజ్జూర్ చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి విక్రయ సంస్థ- కోసిని, గోదావరిఖని వారిచే ఏర్పాటుచేసిన విక్రయ స్టాల్స్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చేనేత వస్త్రాలను ధరించడం ద్వారా చేనేత కార్మిక కుటుంబాలకు ఆర్థికంగా తోడ్పాటు అందించాలని అన్నారు. చేనేత వస్త్రాలు పూర్తిగా నాణ్యతతో కూడి ఉన్నాయని, కలెక్టరేట్ లోని అన్ని శాఖల ఉద్యోగులు, సందర్శకులు స్టాల్స్ ను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. చేనేత వస్త్రాలను కొనుగోలు చేయడం ద్వారా మంచి రాయితీ పొందవచ్చు అని తెలిపారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మిల్లెట్, హనీ స్టాల్స్ ను పరిశీలించి నాణ్యమైన పదార్థాలను విక్రయించాలని సూచించారు.
అంతకుముందు ఆసిఫాబాద్ మండలంలోని వట్టి వాగు కాలనీ గిరిజన ప్రాథమిక పాఠశాల,ఆదర్శ పాఠశాలను డిడి రమాదేవితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా తరగతి గదులు రికార్డులను పరిశీలించారు విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణిలో భాగంగా ప్రజల నుండి వినతులు స్వీకరించారు.
సమస్యల పరిష్కారానికి అన్ని శాఖల సమన్వ యంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు.ప్రభుత్వ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలల్లో విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు కోసం మూడు రోజులలో నివేదికలు తయారు చేయాలని ఆదేశించారు.స్వాతంత్ర వేడుకలను విజయవంతం చేసేందుకు అధికారులు సమన్వ యంతో కృషి చేయాలని సూచించారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు దీపక్ తివారి ,డేవిడ్ ఎస్పి కాంతిలాల్ పాటిల్, సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల, ఆర్డీవో లోకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.