18-10-2025 01:14:54 AM
ఎమ్మెల్యే మేఘారెడ్డి
వనపర్తి, అక్టోబర్ 17 ( విజయక్రాంతి ) : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ దక్కకుండా అడ్డుకున్నది కేంద్రంలోని బిజెపి ప్రభుత్వమేనని, రెండు నాలుకల వైఖరి వహించే బీజేపీ నేతల దురుద్దేశం రాష్ట్ర ప్రజలందరికీ దేశ ప్రజలందరికీ తెలిసిపోయిందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి శుక్రవారం ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ పై చర్చించేందుకు తెలంగాణ రాష్ట్రం నుంచి అఖిలపక్షంగా వచ్చి ప్రధానమంత్రిని కలిసి లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం పదేపదే కోరిన ఎటువంటి స్పందన లేదని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ సందర్భంగా బిసిలకు 42 శాతం రిజర్వేషన్ పై మంకుపట్టు వీడని కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈనెల 18న రాష్ట్రంలో బిజెపికి వ్యతిరేకంగా జరుగుతున్న బిసి బంధు నిరసన కార్యక్రమంలో వనపర్తి నియోజకవర్గం పరిధిలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ పై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉందని సుప్రీంకోర్టు తీర్పు రాగానే బీసీల రిజర్వేషన్ అంశంపై చర్చించి ఈ నెల 23న జరగనున్న క్యాబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే ప్రకటన ద్వారా తెలిపారు.