19-10-2025 12:21:49 AM
బర్దిపూర్ ఆశ్రమ పీఠాధిపతులు
కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న స్వామిజీలు
కొమురవెల్లి, అక్టోబర్ 18 (విజయక్రాంతి): సనాతన ధర్మాన్ని రక్షించుకోవడంతోపాటు హిందూ దేవాలయాలను పరిరక్షించుకుందామని బర్దిపూర్ దత్త గిరి ఆశ్రమ పీఠాధిపతులు వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహారాజ్, మహంత్ సిద్ధేశ్వర నందగిరి మహారాజ్‌లు అన్నారు. సనాతన ధర్మం, ఆలయాల పరిరక్షణ కోసం దత్తగిరి మారాజ్ చారిటబుల్ ట్రస్ట్, విశ్వ మానవ ధర్మ ప్రచారం ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రధాన దేవాలయాల సందర్శనలో భాగంగా కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానాన్ని వారు సందర్శించారు.
ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఘనంగా స్వాగతం పలికారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పీఠాధిపతులు మాట్లాడుతూ ‘సనాతన ధర్మం అంటేనే శాశ్వతమైన విధి. ఇది కాలాతీతమైన సత్యాన్ని ప్రతిబింబిస్తుందని, విశ్వం యొక్క ఉనికికి ఇది మూలం’ అని తెలిపారు. సనాతన ధర్మం పరిరక్షణకు అందరు కృషి చేయాలన్నారు.
విశ్వ మానవ ధర్మ ప్రచారం ఆధ్వర్యంలో ఇప్పటికే పలు దేవాలయాలను సందర్శించి, ధర్మ పరిరక్షణ కోసం అనేక సేవా కార్యక్రమాలను చేపట్టినట్లు వారు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ తమ గ్రామాలలో ఉన్న పురాతన ఆలయాల పరిరక్షణ కోసం కృషి చేయాలని సూచించారు.గ్రామాల్లో ఏవైనా పురాతన దేవాలయాలు ఉంటే వాటిని తమ దృష్టికి తీసుకురావాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు.
వాటి పునరుద్ధరణకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ధార్మిక కార్యక్రమాల ద్వారానే సనాతన ధర్మం రక్షింపబడుతుందన్నారు. అంతకుముందు వారు మల్లికార్జున స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏ ఈ ఓ శ్రీనివాస్, అర్చకులు మహాదేవుని మల్లికార్జున్, మల్లయ్య స్వామి, సూర్య కుమార్, చిన్న మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.