15-11-2024 12:00:00 AM
దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో నిన్నటి (14వ తేది)నుంచి 20వ తేదీ వరకు గ్రంథాలయ వారోత్సవాలను ఆయా ప్రభుత్వా లు నిర్వహిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రంథాలయాలకు పూర్వవైభవం తేవడానికి కృషి చేస్తున్నట్టు తెలుస్తున్నది. గతంలో మూతబడిన అనేక గ్రంథాలయాలను తెరిపిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. గ్రంథాలయ సంస్థకు రాష్ట్ర స్థాయి చైర్మన్‌ను నామినేటెడ్ చేయడం, జిల్లాల వారీగా గ్రంథాలయ చైర్మన్‌లను నియమిస్తున్నారు.
ఈ రకంగా లైబ్రరీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కావలసిన నిధులనూ మంజూరు చేస్తున్నట్టు తెలుస్తు న్నది. విద్యార్థులకు ఉపయోగపడేలా పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో ప్రత్యేక గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తున్నారు. ఉపాధ్యాయ, ఉద్యోగ పోస్టులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తుండడంతో రాష్ట్రంలోని నిరుద్యోగులు, నిరుద్యోగ ఉపాధ్యాయులు లైబ్రరీల లోని పుస్తకాలను ఉపయోగించుకొని, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువకులను దృష్టిలో పెట్టుకొని పోటీ పరీక్షలకు కావలసిన పుస్తకాలను అందుబాటులో ఉంచడంతోపాటు గ్రంథాలయాలలో సౌకర్యాలను మెరుగు పరుస్తున్నారు. గ్రంథాలయాల సమయం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉంటుంది. పోటీ పరిక్షలకు తేదీలు ఖరారు కావడంతో రాత్రివేళ గంటసేపు ఎక్కువగా తెరిచి ఉండేట్టు ఉత్తర్వు లు జారీ చేశారు. పేద, బడుగు, బలహీన, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు గ్రంథాలయాలు ఎంతో బాగా తోడ్పడుతున్నా యి.
పాఠ్య పుస్తకాలు కొని చదువుకొనే పేద విద్యార్థులకు, జనరల్ నాలెడ్జ్, దేశ భక్తి నాయకుల చరిత్రలు, అన్ని మతాల గ్రంథాలు, పండుగలు, సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు సంబంధించిన అన్ని పుస్తకాలు గ్రంథాల యాలలో అందుబాటులో ఉంటున్నాయి. అయి తే, వీటిని మరింతగా విస్తృతం చేయవలసిన అవసరం చాలా ఉంది.
గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలుగా విద్యార్థులుసహా నిరుద్యోగుల నుంచి వృద్దుల వరకు అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటా యి. ఆధునిక సాంకేతికత మరీ ముఖ్యంగా సెల్‌ఫోన్ విప్లవం ఈ స్థాయిలో లేని రోజుల్లో పుస్తక మే ప్రతీ ఒక్కరికీ హస్తభూషణం వలె ఉండేది. నిజానికి ఇప్పటికీ పుస్తకం విలువ చెక్కు చెదరలేదు. అది పోయేదీ కాదు. సమాచార రంగంలోకి సాంకేతిక విప్లవం వచ్చి చేరాక, చాలామందికి గ్రంథాలయాలతో పనిలేకుండా పోయిందన్నది నిజమే. ఒకప్పుడు లైబ్రరీకి వెళితే తప్ప విజ్ఞాన సమాచారం లభించేది కాదు.
కానీ, ఇప్పుడలా కాదు. చేతిలో సెల్ ఫోన్, ఇంటర్నెట్ సౌకర్యాలతో గ్రంథాలతో ఎవరికీ పనిలేకుండా పోయింది. ఆన్‌లైన్‌లో కూడా పుస్తకాలు సైతం అందుబాటులోకి వచ్చాయి. ఆన్‌లైన్‌లో ఖరీదు చేయడంతోపాటు పీడీఎఫ్ రూపంలో చదువుకునే వెసులుబాటూ లభించింది. ‘గ్రంథాలయ వారోత్సవాలు’ సందర్భోచితం అనిపించుకుంటాయా? అన్న ప్రశ్న ఉత్పన్నం కావచ్చు. కానీ, సోషల్ మీడి యా ఎంత వేగంగా, విస్తృతంగా వ్యాపించినా గ్రంథాలయాల ఆవశ్యకత తగ్గేది కాదనడంలో ఎవరికీ ఎలాంటి సందేహమూ లేదు. కనుకే, ఈ వారోత్సవాలు ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నాయి.
పునరుజ్జీవ కృషి జరగాలి!
ఈ పరిస్థితుల్లో లైబ్రరీలను ఎలా తీర్చిదిద్దాలి? ఏం చేస్తే పిల్లలు, స్కూలు, కాలేజీ విద్యార్థులు, నిరుద్యోగులు గ్రంథాలయాలను సందర్శిస్తారు? ఏ రకమైన పుస్తకాలను అక్కడ అందుబాటులో ఉంచాలి? ఇలాంటి వాటికి జవాబులు కనుక్కోవడంతోపాటు లైబ్రరీలలో పుస్తకాలుసహా డిజిటల్ సౌకర్యాలనూ పెద్ద ఎత్తున ఏర్పాటు చేయవలసి ఉంది. ఉన్న గ్రంథాలయాలలో, కొత్తగా ప్రారంభించబోయే లైబ్రరీలలో పుస్తకాలతో సమానంగా కంప్యూటర్స్, ఇంటర్నెట్ సౌకర్యాలు విస్తృతంగా అందుబాటులో ఉంచాలి. అప్పుడే గ్రంథాలయాలు మారిన కాలానికి తగ్గట్టు ఆధునిక సమాచార కేంద్రాలుగా విలసిల్లుతాయి.
- డా. ఎస్. విజయభాస్కర్
సెల్: 9290826988