calender_icon.png 14 May, 2025 | 2:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా ప్రభుత్వంలో జుక్కల్ నియోజకవర్గం సీఎంఆర్ఎఫ్ లో కొత్త రికార్డు సృష్టించింది

13-05-2025 08:37:35 PM

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు..

బిచ్కుంద (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ మండల నాయకుల సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు(MLA Thota Lakshmi Kanta Rao) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... గత బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డగోలుగా అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించినప్పటికీ.. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నాయకత్వంలో.. ప్రజా ప్రభుత్వం దుబారా ఖర్చులు చేయకుండా, ఆర్థిక క్రమశిక్షణతో ఒక్కో సంక్షేమ పథకాన్ని అమలు చేస్తూ ప్రజల ఆదరణ పొందుతుందని తెలిపారు.

అదేవిధంగా జుక్కల్ నియోజకవర్గంలో కూడా తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని చెప్పారు. ప్రభుత్వం పేదలకు ఇస్తున్న ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక అత్యంత పారదర్శకంగా జరిగేవిధంగా చూడాలని.. అర్హులను గుర్తించి ప్రతీ ఒక్కరికీ పథకాలు అందేలా కృషి చేయాలని అన్నారు. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం 'రాజీవ్ యువ వికాసం పథకం' తీసుకొచ్చిందని చెప్పారు.

ప్రజా ప్రభుత్వంలో జుక్కల్ నియోజకవర్గం సీఎంఆర్ఎఫ్ లో కొత్త రికార్డు సృష్టించిందని ఎమ్మెల్యే తెలిపారు. అనారోగ్య సమస్యలతో లేదా ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం కోసం సుమారు 5 కోట్ల 33 లక్షల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశామని చెప్పారు. సుమారు 300 పై చిలుకు మందికి ఎల్వోసీలు మంజూరు చేశామని తెలిపారు. మనం చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలని సూచించారు. తెలంగాణలో జుక్కల్ నియోజకవర్గాన్ని నెం.1 గా తీర్చిదిద్దుతానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరూ ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను తెలుసుకోవాలని, వాటి పరిష్కారానికి కృషి చేయాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.