13-05-2025 08:27:29 PM
రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్..
మహదేవపూర్ (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు పురస్కరించుకొని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ(State Disaster Management Department) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(District Collector Rahul Sharma)తో కలిసి విఐపి ఘాట్, సరస్వతి మాతా విగ్రహం, భక్తులు పుష్కర స్నానాలు చేయు నది, త్రివేణి సంగమం, గోదావరి ఘాట్, దేవాలయం, బందోబస్తు ప్రణాళిక తదితర రక్షణ ఏర్పాట్లును మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా విపత్తుల ప్రత్యేక కార్యదర్శి మాట్లాడుతూ.. ఈనెల 15 నుండి 26 వరకు జరిగే సరస్వతి నదీ పుష్కర మహోత్సవాల సందర్భంగా భక్తులకు అత్యుత్తమమైన భద్రత, అత్యవసర సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఈ నెల 14వ తేదీ నుండి 27వ తేదీ వరకు కాళేశ్వరంలో జాతీయ, రాష్ట్ర విపత్తులు దళ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ ఒక టీము 34 మంది, ఎస్డీఆర్ ఎఫ్ రెండు టీములు 66 మంది సిబ్బంది మూడు షిప్టుల్లో 24X7 విధులు నిర్వహిస్తారని తెలిపారు. సరస్వతి పుష్కరాల సమయంలో ఏదైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు వెంటనే స్పందించి తక్షణమే సేవలు అందించేందుకు జాతీయ విపత్తుల స్పందనా దళం(ఎన్డీఆర్ఎఫ్), రాష్ట్ర విపత్తుల స్పందనా దళం (ఎస్డీఆర్ఎఫ్) బలగాలను వివిధ ఘాట్ల వద్ద సిద్ధంగా ఉంచుతున్నట్లు తెలిపారు. రెండు టీములు ఘాట్స్ వద్ద ఒక టీము దేవాలయం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
సరస్వతి పుష్కరాలకు పెద్దఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున రద్దీ నియంత్రణకు సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజలు భద్రతా నిబంధనలను పాటిస్తూ, అధికారుల సూచనల ప్రకారం పుష్కర స్నానాలు చేయాలని ఆయన సూచించారు. భక్తులు ప్రమాద హెచ్చరికల సూచికలు దాటి నదిలోకి వెళ్లకుండా పటిష్ట పర్యవేక్షణ చేయాలని సూచించారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి పారిశుద్య కార్యక్రమాలు నిర్వహించి పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. పుష్కరాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు అత్యంత ముఖ్యమని ఎప్పటికపుడు వ్యర్థాలను తొలగిస్తూ పరిశుభ్రంగా ఉంచాలని, నది, దేవాలయ పరిసరాలు మొత్తం జల్లెడ పట్టి పరిశుభ్రం చేయాలని, వ్యర్థాలు తొలగింపు పర్యవేక్షణ కు ప్రత్యేక అధికారులు ద్వారా పర్యవేక్షణ చేయాలని సూచించారు.
పారిశుద్ధ్య. కార్యక్రమాలు నిరంతరాయంగా జరగాలని స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఇరిగేషన్ ఎస్ఈ సత్యనారాయణ, జిల్లా అగ్నిమాపక అధికారి కెవి సతీశ్ కుమార్, తెలంగాణ రీజియన్ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ డిప్యూటీ కమాండెండ్ దామోదర్ సింగ్, కాటారం డిఎస్పీ రామ్మోహన్ రెడ్డి, దేవస్థానం ఈఓ మహేష్ తదితరులు పాల్గొన్నారు.