మారుతి లాభం 48 శాతం వృద్ధి

27-04-2024 12:20:00 AM

అమ్మకాల ఆదాయం రూ.38,235 కోట్లు 

షేరుకు రూ.125 డివిడెండు

ముంబై, ఏప్రిల్ 26: పాసింజర్ వాహనాల్లో మార్కెట్ లీడర్ అయిన మారుతి సుజుకి క్యూ4 లో విశ్లేషకుల అంచనాలకు అనుగుణమైన ఫలితాల్ని ప్రకటించింది. 2024 మార్చి త్రైమాసికంలో మారుతి స్టాండెలోన్ నికరలాభం 48 శాతం వృద్ధితో రూ.3,878 కోట్లకు చేరగా, రూ.38,235 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. మెజారిటీ విశ్లేషకులు రూ.3,916 కోట్ల నికర లాభాన్ని, రూ.38,772 కోట్ల ఆదాయాన్ని అంచనా వేశారు. తాజాగా ముగిసిన త్రైమాసికంలో ఆర్జించిన నికరలాభం 2023 డిసె ంబర్ క్వార్టర్లో కనపర్చిన రూ.3,208 కోట్లకంటే ఎక్కువ. గత ఏడాది క్యూ4లో రూ.2,624 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. కంపెనీ డైరెక్టర్ల బోర్డు షేరుకు రూ. 125 చొప్పున డివిడెండును సిఫార్సుచేసిం ది. ఫలితాల నేపథ్యంలో శుక్రవారం మారు తి సుజుకి షేరు ఎన్‌ఎస్‌ఈలో 1.7 శాతం క్షీణించి రూ.12,703 వద్ద ముగిసింది. 

రికార్డుస్థాయిలో వాహన విక్రయాలు

2023 ఆర్థిక సంవత్సరంలో మారుతి సుజుకి రికార్డుస్థాయిలో 21,35,323 వాహనాల్ని విక్రయించింది. గత ఆర్థిక సంవత్సరంలో నమోదైన అమ్మకాలకంటే 8.6 శాతం వృద్ధి సాధించింది. క్యూ4లో 5,84,031 యూనిట్లను విక్రయించింది. పూర్తి ఆర్థిక సంవత్సరంలో కంపెనీ స్టాండెలోన్ నికరలాభం 64 శాతం వృద్ధితో రూ.13,209 కోట్లకు పెరిగింది. కంపెనీ ఆదాయం 20 శాతం పెరిగి రూ.1,40,933 కోట్లకు చేరింది.