25-11-2025 10:34:05 PM
భద్రాచలం (విజయక్రాంతి): డిజిటల్ అరెస్టు నుంచి భద్రాచలం పట్టణానికి చెందిన సీనియర్ వైద్యుడిని అతడి కుటుంబాన్ని సైబర్ సెక్యూరిటీ బ్యూరో కాపాడి సైబర్ నేరగాల నుండి విముక్తి కల్పించారు. భద్రాచలంలోని ఓ ప్రైవేటు వైద్యుడిని సైబర్ నేరగాళ్ల బారి నుండి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కాపాడింది. ఈనెల 20వ తేదీన భద్రాచలం పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యుడు బి సుబ్బరాజుకు సిబిఐ అధికారులుగా నటిస్తున్న నేరస్తుల నుంచి వాట్సాప్ వీడియో కాల్స్ వచ్చాయి. ముంబైలో తన ఆధార్ తో తెరిచిన బ్యాంకు ఖాతాకు సిబిఐ దర్యాప్తు చేస్తున్న 100 కి పైగా క్రిమినల్ కేసులతో సంబంధం ఉందని వారు సుబ్బరాజును బెదిరించారు.
ఈ క్రమంలో వైద్యుడు కుటుంబాన్ని కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేయడానికి మోసగాళ్లు మీరు సిబిఐ నిఘాలో ఉన్నారని హెచ్చరిస్తూ... ఎవరికి సమాచారం ఇవ్వద్దని ఆదేశించారు. ప్రతి గంటకు వీడియో కాల్ కాంటాక్ట్ నిర్వహించమని వారిని ఒత్తిడి చేశారు. 80 ఏళ్ల వయసు పైబడిన సుబ్బరాజు భయపడడంతో అతని వద్ద నుంచి వారి బ్యాంకు ఖాతాల సమాచారాన్ని కూడా నేరగాళ్లు సేకరించారు. దీంతో వైద్యుడి కుటుంబం బయటకు రావడం మానేసి ఆసుపత్రికి హాజరు కాకపోవడంతో ఆస్పత్రి కాంపౌండర్ కు అనుమానం వచ్చి విషయం తెలుసుకొని ఈనెల 23 రాత్రి కొత్తగూడెం జిల్లా సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ డీఎస్పీ అశోక్ బాబుకు సమాచారం అందించారు.
దీంతో డి.ఎస్.పి అశోక్ బాబు ఇన్స్పెక్టర్ జితేందర్ ఆ వైద్యుని నివాసానికి చేరుకుని సైబర్ మోసగాళ్ల బారి నుండి వారిని విముక్తి చేశారు. సైబర్ నేరగాళ్ల భారి నుండి వారు సకాలంలో స్పందించి సమాచారం అందించడంతో అధికారులు భారీ ఆర్థిక నష్టం నుండి వైద్యుడు కుటుంబాన్ని కాపాడారు. అనంతరం సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ కేసు విషయంలో చురుకుగా వ్యవహరించిన డిఎస్పి అశోక్ బాబు, ఇన్స్పెక్టర్ జితేందర్ లను టీజీసిఎస్బి డైరెక్టర్ షికా గోయల్ అభినందించారు. సైబర్ నేరగాళ్ల పట్ల పౌరులు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. బాధితుడు డాక్టర్ సుబ్బరాజు మాత్రం వారి మాటల్లో గాంభీరత్వాన్ని చూసి ఒకింత భయాందోళనకు గురైనట్లు తెలిపారు సైబర్ తనతో అతిచాకచక్యంగా మాట్లాడి తనను తన కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేశారని విషయం తెలుసుకున్న పోలీసులు స్పందించడంతో ఈ ప్రమాదం నుండి బయట పడ్డట్లు సుబ్బరాజు వెల్లడించాడు.