25-11-2025 10:25:17 PM
తూప్రాన్ (విజయక్రాంతి): సోషల్ మీడియా గ్రూపుల్లో జర్నలిస్టులను కించపరుస్తూ పరువుకు భంగం కలిగే విధంగా ముఖ్యమంత్రి మాట్లాడిన వీడియో క్లిప్పింగులను పోస్ట్ చేసిన తూప్రాన్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు నందాల శ్రీనివాస్ పై మంగళవారం తూప్రాన్ జర్నలిస్టులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తూప్రాన్ పట్టణ పరిధిలో ఉన్న అవుసులోని కుంటకట్ట ఆక్రమణపై పత్రికల్లో వార్తా కథనాలను రాసినందుకు, ఇరిగేషన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేసినందుకు జీర్ణించుకోలేని శ్రీనివాస్ దొంగ ఎవరంటే బుజాలు తడుముకున్న విధంగా ఎపుడో ఒక సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియో క్లిప్పింగును జర్నలిస్టులను కించపరిచేవిధంగా సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అంతే కాకుండా ఆ వీడియోకు వీపులు పగులుతాయి జాగ్రత్త అని హెచ్చరికల క్యాప్షన్ పెట్టాడు. నందాల శ్రీనివాస్ దుష్టచేష్టలపై జర్నలిస్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.