06-11-2025 07:53:09 PM
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి, (విజయక్రాంతి): వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు తెచ్చిన ధాన్యం నిర్దేశించిన తేమశాతం వచ్చిన వెంటనే తూకం చేసి కేటాయించిన మిల్లుకు లోడ్ చేసి పంపించేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం చిట్యాల లోని మార్కెట్ యార్డులో ఐకెపి ద్వారా ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిపిసి కేంద్రంలో రైతులు తెచ్చిన ధాన్యాన్ని టోకెన్ల వారీగా రిజిస్టర్లలో నమోదు చేస్తున్నారా లేదా అని పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు తెచ్చిన ధాన్యం నిర్దేశించిన తేమశాతం వచ్చిన వెంటనే తూకం చేసి కేటాయించిన మిల్లుకు లోడ్ చేసి పంపించేయాలని ఆదేశించారు.
రైతులు ధాన్యాన్ని తెచ్చిన వారిని తెచ్చినట్లుగా రిజిస్టర్లలో నమోదు చేసి తేమశాతాన్ని తనిఖీ చేసి సీరియల్ గా నమోదు చేయాలన్నారు. సన్న రకాన్ని దొడ్డు రకాన్ని గుర్తించడంలో నిర్వాహకులు అవగాహన కలిగి ఉండాలని ఆదేశించారు. ఈ సందర్భంగా సదరు కొనుగోలు కేంద్రం యొక్క నిర్వాహకురాలిని సన్న రకంధాన్యాన్ని దొడ్డు రకంధాన్యాన్ని గుర్తించమని కలెక్టర్ ఆదేశించగా వారికి అవగాహన లేకపోవడం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యాన్ని గుర్తించడాన్ని నేర్పించాలని సీసీకి సూచించారు. తేమ శాతం వచ్చిన వెంటనే బరువు కొలిచి, నిర్దేశించిన మిల్లుకు లోడ్ చేసి పంపాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, రైతులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.