03-05-2025 01:46:18 AM
నిజాంసాగర్, మే 2: ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో అమ్మేందుకు వస్తే అందిన కాడికి తరుగు పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడంలేదని రైతులు వాపోతున్నారు. తమ బాధ ఎవరికి చెప్పాలో అర్థం కాక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
కొనుగోలు కేంద్రం ద్వారా గిట్టుబాటు ధర లభిస్తుంది అనుకుంటే అధికారుల నిర్లక్ష్యానికి తోడు రైస్ మిల్లు యజమానులు దోపిడీకి గురి చేస్తు రైతన్నల ఉసురుతీస్తున్నారు. జిల్లాస్థాయి అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో మిల్లుల దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతుంది.
రైస్ మిల్లుల దోపిడి పై ’విజయక్రాంతి’ ప్రతినిధి ఆరా తీయగా ఏకంగా ఒక్క లారీకే 13 క్వింటాళ్ల 20 కిలోల ధాన్యాన్ని కోత విధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని మర్పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం ద్వారా బిచ్కుంద మండలంలోని రాదే ఫుడ్ ఇండస్ట్రీస్ (174382) రైస్ మిల్ కు ఏప్రిల్ 25న 619 బస్తాల ధాన్యాన్ని (247.60 క్వింటాళ్ల) ధాన్యాన్ని రైస్ మిల్లుకు పంపగా, తరుగు పేరుతో 33 బస్తాల (13 క్వింటాల్ల 20 కిలోలు) ధాన్యన్ని కోత విధించారు.
కేవలం 586 బస్తాలకు కుదించి 223 క్వింటాళ్ల 40 కిలోలు మాత్రమే ఐకెపి అధికారులకు ట్రక్ షీట్లో రాసి పంపించారు. ఇంత జరుగుతున్నా తమ పక్షాన మాట్లాడే నాథుడు లేకపోవడంతో రైతులు లబోది దిబోమంటున్నారు.
మిల్లుల యజమానుల దోపిడీని అడ్డుకట్ట లేదా
ఇష్టారీతిన మిల్లు యజమానులు ధాన్యం లో కోత విధిస్తే అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. రైస్ మిల్లర్లు అధికారులతో కుమ్మక్కై ఈ దందా కొనసాగిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతులను, ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న రైస్ మిల్లులపై ప్రభుత్వం గతంలో చర్యలు చేపట్టింది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని చెబుతున్నా ఇప్పుడు పట్టించు కోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
జిల్లాస్థాయి అధికారుల సమగ్ర పర్యవేక్షణ లేకపోవడంతోనే రైస్ మిల్లుల ఆగడాలు మితిమీరు తున్నాయని రైతులు మండిపడుతున్నారు. తరుగు పేరుతో మోసం చేస్తున్న రైస్ మిల్లులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మిల్లర్ల ఆగడాలపై కలెక్టర్ దృష్టి సారించి, రైతులను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లా స్థాయి అధికారులు కొనుగోలు కేంద్రాలను సమన్వయం చేసుకుంటూ రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
పట్టింపు లేని ఏపీఎం
మిల్లర్ల దోపిడీపై నిజాంసాగర్ మండల ఇందిరా క్రాంతి పథకం ఏపీఎం రామ్ నారాయణగౌడ్ ను వివరణ కోరగా నిర్లక్ష్య సమాధానం ఇచ్చారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని ఛన్ని పట్టించి తూకం వేయాల్సి ఉన్న సదరు లారీ చెన్ని పట్టకపోవడంతో తరుగు వచ్చిందని చెప్పడం గమనార్హం. సదరు అధికారి పర్యవేక్షణ లోపంతోనే ఇలా జరుగుతుందనేది స్పష్టమవుతుంది. రైతు తరఫున సదరు మిల్లు యజమానులతో మాట్లాడి న్యాయం చేయాల్సిన అధికారి తమకేం పట్టనట్టు వ్యవహరించడం విడ్డూరంగా ఉంది.
అధికారులు నిర్లక్ష్యంతోనే
అధికారుల నిర్లక్ష్యం.. రైస్ మిల్లుల ఇష్టారాజ్యంతో రైతులు నష్టపోతున్నారు. ఒక్క లారిలోనే 13 క్వింటాళ్ల ధాన్యం దోపిడీ చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఆరుగాలం కష్టం చేసి పండించిన ధాన్యం ఇలా ఉత్తి పుణ్యానికి మిల్లర్లకు అప్పజెప్పల్సి వస్తుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతుల ధాన్యాన్ని తరుగు పేరుతో దోపిడీ చేయడం అరికట్టాలి.
చేనబోయిన రాములు, మార్పల్లి