calender_icon.png 3 May, 2025 | 4:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోర్డులకే క్రీడా ప్రాంగణాలు పరిమితం?

03-05-2025 01:22:49 AM

‘నవ్వులాట’గా మైదానాలు?

చేన్లు, చెలకల్లో ఆటలాడుకుంటున్న పిల్లలు

మహబూబాబాద్, మే 2 (విజయక్రాం తి): గ్రామీణ ప్రాంతంలో క్రీడల అభివృద్ధి కోసం గత ప్రభుత్వ హయాంలో ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాల్లో అధికం ‘నవులాట’లుగా మారాయి.

ప్రస్తుత వేసవి సెలవుల నేపథ్యంలో గ్రామాల్లో పిల్లలు ఆటలాడు కోవడానికి క్రీడా ప్రాంగణం లేక, సొంత ఖర్చులతో ప్రైవేటు వ్యక్తులకు చెందిన చేన్లు, చెలకలను చదును చేయించి ఆటలాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మూడేళ్ల క్రితం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జనాభా సంఖ్యకు తగ్గట్టుగా గ్రామా ల్లో మూడు క్యాటగిరీలుగా విభజించి క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశారు.

ఉపాధి హామీ పథకంలో ఎకరానికి పైబడి స్థలం ఉన్నచోట 4.20 లక్షలు, అరె ఎక్కడ ఉన్నచోట 2.10, అంతకంటే తక్కువ స్థలం ఉన్నచోట లక్ష రూపాయల వ్యయంతో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటుకు నిర్దేశించారు. క్రీడా ప్రాంగణాల్లో వాలీబాల్, ఖో ఖో, లాంగ్ జంప్, కబడ్డీ  ఆటలాడుకోవడానికి అనువుగా మైదానాన్ని తీర్చిదిద్దాలని ప్రణాళిక రూపొందించారు. అలాగే యువకులు వ్యాయామం చేసుకోవడానికి అనువుగా సింగిల్, డబుల్ బార్లు ఏర్పాటు చేయాలని, మైదానం చదును చేయడానికి ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు.

ఈ విధంగా పలు గ్రామాల్లో అనువైన స్థలం ఉన్నచోట క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశారు. అయితే చాలా గ్రామాల్లో అనువైన స్థలం లేక క్రీడా ప్రాంగణాలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయలేదు. కొన్నిచోట్ల కేవలం బోర్డులు నాటి వదిలేశారు. అప్పట్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాటు అంశాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని కచ్చితంగా ఏర్పా టు చేయాలని నిర్దేశించినప్పటికీ, అనువైన స్థలం లేక కొన్నిచోట్ల అధికారుల ఒత్తిడితో కేవలం బోర్డులు మాత్రమే నాటి చేతులు దులుపుకున్నారు.

ఇందులో భాగంగా మహబూబాబాద్ జిల్లాలో 300కు పైగా గ్రామాల్లో ఏర్పాటుచేసిన క్రీడా ప్రాంగణాల్లో అధిక సంఖ్యలో ఆటలాడుకోవడానికి అణువుగా లేవని ప్రజలు ఆరోపిస్తున్నారు. కొన్నిచోట్ల కేవలం క్రీడా ప్రాంగణం నేమ్ బోర్డు ఏర్పాటుచేసి, ఆడుకోవడానికి, వ్యాయామం చేయడానికి కనీస వసతులను కల్పించకుండా వదిలేశారు. దీనితో ఈ వేసవికాలంలో పిల్లలు ఆటలాడుకోవడానికి చేన్లు, చెలకల్లో ఆటలాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.

చదువుతోపాటు ఆటల్లో రాణించడానికి జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాల్లో కనీసం మైదానం లేకపోవడంతో పిల్లలు ఆటలాడుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ స్పందించి చదువుతోపాటు క్రీడల్లో రాణించేందుకు గ్రామీణ స్థాయి నుంచి క్రీడాకారులను తీర్చిదిద్దే విధంగా అనువైన స్థలాన్ని కేటాయించి క్రీడా పరికరాలను ఏర్పాటు చేయాలని విద్యార్థులు, యువకులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. 

వెయ్యి రూపాయలతో ఆట స్థలాన్ని చదును చేయించాం

ఎండాకాలం రావడంతో విద్యాసంస్థలకు వేసవి సెలవులు ఇచ్చారు. ఉదయం సాయంత్రం ఆటలాడుకోవడానికి క్రీడా మైదానం లేదు. ఆటలాడుకోవడానికి మేముండే ఇండ్లకు సమీపంలో ఉన్న వ్యవసాయ భూమిని ఆటస్థలంగా మార్చుకున్నాం. అందులో ఉన్న పత్తి బెరడును తొలగించేందుకు తలకొంత పోగేసి వెయ్యి రూపాయలతో డోజర్ ద్వారా చదును చేయించాం.

దీనితో కాస్త మాకు ఆటలాడుకోవడానికి స్థలం దొరికింది. ప్రతి గ్రామంలో అన్ని హంగులతో క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తే చదువుతోపాటు దేహదారుద్యం పెరిగి యువత, విద్యార్థులు ఆటల్లో రాణించడానికి దోహదపడుతుంది.  గుగులోత్ శ్యామ్,విద్యార్థి, కేసముద్రం

క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేస్తే ఒక్క రూపాయి ఇవ్వలేదు?

క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలని మాపై ఒత్తిడి చేశారు. సరే పిల్లలు ఆటలాడుకుంటారు కదా, అని ముందు పడి 70 వేల రూపాయలు ఖర్చు చేసి ప్రభుత్వం కేటాయించిన స్థలం చదును చేసి వివిధ క్రీడా పరికరాలను ఏర్పాటు చేయించాం. బోర్డు పెట్టి మైదానాన్ని సుందరంగా తీర్చిదిద్ది పిల్లలు ఆడుకునేందుకు అణువుగా రూపొందించాం.

ఇప్పటివరకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. పైనుంచి 70 వేల రూపాయలు ఖర్చు పెడితే కేవలం 15 వేలకు మాత్రమే బిల్లు చేసినట్లు చెబుతున్నారు. బిల్లు చేసిన 15 వేల లో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. పదవీకాలం ముగిసిపోయి ఏడాది దాటిన క్రీడా మైదానానికి పెట్టిన పెట్టుబడి ఇవ్వకపోవడంతో ఆర్థికంగా నష్టపోయాం. 

 నిర్మల, మాజీ సర్పంచ్, పెనుగొండ