calender_icon.png 19 November, 2025 | 11:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిగ్ వర్కర్లపై ప్రేమ.. మాపై వివక్ష?

19-11-2025 12:00:00 AM

-10 ఏళ్లు పనిచేసినా ఉద్యోగ భద్రత లేదు

-నెలల తరబడి వేతనాలు రాక అవస్థలు పడుతున్నాం

-సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి

-ఔట్‌సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేసి, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

-ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల డిమాండ్

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 18 (విజయక్రాంతి): గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, వారికి ఆరోగ్య, ఉద్యోగ భద్రత కల్పించిన తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నామని, కానీ, పది, పదిహేనేళ్లుగా ప్రభుత్వ కార్యాలయాల్లో వెట్టిచాకిరీ చేస్తున్న ఐదు లక్షల మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులపై ఈ వివక్ష ఎందుకు అని తెలంగాణ స్టేట్ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ జేఏసీ ప్రభుత్వాన్ని  ప్రశ్నించింది.

ప్రభుత్వానికి వెన్నుముకలా పనిచేస్తున్న తమ బతుకులు అభద్రతతో, అప్పులతో కునారిల్లుతున్నాయని, తమ గోడును ప్రభుత్వం పట్టించుకోవాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు జేఏసీ రాష్ర్ట అధ్యక్షుడు పులి లక్ష్మయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ రజా అహ్మద్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ప్రభుత్వంలో పనిచేస్తూ మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి గానీ, ఏజెన్సీ నుంచి గానీ ఒక్క రూపాయి సాయం అందడం లేదు. ఆ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.

ఇది ఏ రకమైన సామాజిక న్యాయం? జీఎస్టీ, రిజిస్ట్రేషన్, ఎక్సుజ్ వంటి శాఖల్లో పదేళ్లకు పైగా పనిచేసిన వారిని “ఉద్యోగ భద్రత లేదు” అంటూ ఒక్కసారిగా తొలగిస్తున్నారు. ఆ కుటుంబాల పరిస్థితి ఏంటి? జీవితాంతం ప్రభుత్వానికి సేవ చేసినా, చివరకు పెన్షన్, గ్రాట్యుటీ వంటి ప్రయోజనాలేవీ లేకుండా ఖాళీ చేతులతో పంపిస్తున్నారు. ఇదేనా న్యాయం?చాలా ఏజెన్సీలు ఈఎస్‌ఐ, ఈపీఎఫ్ కట్టడం లేదు. అనారోగ్యం పాలైతే, ఉద్యోగులు అప్పులు చేసి ప్రాణాలు నిలబెట్టుకోవాల్సి వస్తోంది.

భూభారతిలో 16 నెలలు, బీసీ వెల్ఫేర్‌లో 7 నెలలు, ల్యాండ్ అక్విజిషన్‌లో 9 నెలలుగా జీతాలు లేవు. ఇళ్ల కిరాయిలు, పిల్లల ఫీజులు కట్టలేక ఆత్మహత్యలే శరణ్యమవుతున్నాయి. ఉద్యోగం పేరుతో రూ.2-3 లక్షలు వసూలు చేస్తూ, పీఎఫ్, ఈఎస్‌ఐ డబ్బులు మింగేస్తున్న ఏజెన్సీలపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అని ప్రశ్నించారు. దోపిడీకి పాల్పడుతున్న ఏజెన్సీ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి, ప్రభుత్వం నేరుగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని, ఆరోగ్య భద్రత, ఈఎస్‌ఐ, ఈపీఎఫ్ బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని కోరారు. మరణించిన, రిటైర్ అయిన ఉద్యోగుల కుటుంబాలకు భద్రతా పథకాలు అందించాలని, నెలనెలా సకాలంలో వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.