calender_icon.png 11 August, 2025 | 4:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లాభాల్లో ఉంటే ఆస్తుల తాకట్టు ఎందుకు?

11-08-2025 01:43:04 AM

ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్

హైదరాబాద్, ఆగస్టు 10 (విజయక్రాంతి): ఆర్టీసీ గౌలిగూడ బస్‌స్టేషన్‌ను బ్యాంకు రుణం రూ.400 కోట్ల కోసం ఎందుకు  తాకట్టు పెట్టాల్సి వచ్చిందని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ర్ట కమిటీ ఒక ప్రకటనలో నిలదీసింది.  మహాలక్షి పథకం ద్వారా భారీగా లాభాలు గడించిదని చెప్పి సంబరాలు చేసుకొని వారం రోజులు గడువక ముందే బ్యాంకులకు ఆర్టీసీ ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తీసుకొనే దుస్థితి ఎందుకు వచ్చిందో అటు ప్రభుత్వం, ఇటు యాజమాన్యం సమాధానం చెప్పాలని యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్ బాబు, ఈదురు వెంకన్న డిమాండ్ చేశారు.

ప్రభుత్వం, యాజమాన్యం ఇద్దరు తెలంగాణ సమాజాన్ని, ఆర్టీసీ కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పేందుకు ఇదే నిదర్శనమని వారు పేర్కొన్నారు. అసలు మహాలక్ష్మి జీరో టికెట్ డబ్బులు ప్రతి నెలా ఆర్టీసీకి ప్రభుత్వం ఎంత ఇస్తున్నదో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. 2024 నుంచి 2025 జులై వరకు ఇంకా ఎంత బాకీ ఉన్నదో ఆ వివరాలను యాజమాన్యం వెంటనే శ్వేతపత్రం ద్వారా వెల్లడించాలన్నారు.

ప్రతి వేదికలో రాష్ర్ట ప్రభుత్వం ఇప్పటివరకు రూ.6,680 కోట్లు ఆర్టీసీకి ఇచ్చినట్లు గొప్పగా చెప్పకుంటున్నదని గుర్తుచేశారు. ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం స్పందించి ఆర్థికశాఖ ద్వారా ఇచ్చిన డబ్బుల లెక్కలపై శ్వేత పత్రం విడుదల చేసి ప్రజలకు, ఆర్టీసీ కార్మికులకు ఉన్న అనుమానాలు తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రతీసారి 3,038 ఉద్యోగాల నోటిఫికేషన్ గురించి ప్రకటనలను గుప్పిస్తున్నారని, కానీ 20 నెలల నుంచి ఎందుకు ఈ ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయడంలేదని ప్రశ్నించారు.

ఇప్పటికే ఆర్టీసీలో 17వేల సిబ్బంది రిటైర్డ్ అయ్యారని, ఈ 3,038 నియామకాలు ఏ మూలకు సరిపోవన్నారు. వీటితో పాటు 10 వేల మంది సిబ్బందిని నియమించి కార్మికులపై మోపిన అధిక పనిభారాన్ని తగ్గించాలని ప్రభుత్వం,యాజమాన్యాలకు విజ్ఞప్తి చేశారు.