16-10-2025 08:06:37 PM
గజ్వేల్ పట్టణంలో సన్నాహక సమావేశం..
గజ్వేల్: 42% బీసీ రిజర్వేషన్ల కోసం ఈనెల 18న నిర్వహించనున్న రాష్ట్ర బంద్ ను విజయవంతం చేయాలని బీసీ కుల సంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చింది. గజ్వేల్ ప్రెస్ క్లబ్ లో బీసీ కుల సంఘాల ఐక్యవేదిక ఏర్పాటు కోసమై ఈరోజు సమావేశం నిర్వహించారు. ఈనెల 18న బీసీ జేఏసీ పిలుపుమేరకు రాష్ట్ర బందును విజయవంతం చేసేందుకు ప్రతి బీసీ బిడ్డ రావాలని, అదేవిధంగా మిగతా సమాజం కూడా బందుకు సహకరించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బలహీన వర్గాలకు కూడా దామాషా ప్రకారం విద్యా ఉద్యోగ రాజకీయ అంశాల్లో భవిష్యత్తు ప్రభుత్వాలు రిజర్వేషన్ ద్వారా వారి అభ్యున్నతికి పాల్పడాలని ఆనాడే చెప్పారని, కానీ ఇప్పటికీ బీసీ సమాజం ఇంకా వెనుకబాటుకు వివక్షకు గురి అవుతూనే ఉందని వారు ఆవేదన వెలిబుచ్చారు. ఇప్పటికైనా పార్టీలు చిత్తశుద్ధితో బీసీలకు సముచిత రిజర్వేషన్ వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని డిమాండ్ చేశారు.
రాజకీయ ఓటు బ్యాంకుగా చూడకుండా కచ్చితంగా బీసీలకు న్యాయం జరిగే విధంగా ఈ ఐక్యవేదిక భవిష్యత్తు కార్యక్రమాలు చేపడుతుందన్నారు. కాబట్టి బీసీలకు భవిష్యత్తు ఉండాలని అనుకుంటే ఇప్పుడే ముందడుగు వేయాల్సి ఉంటుందన్నారు. బందు ద్వారా మన యొక్క సత్తా ఏందో చూపెట్టి బీసీల హక్కును సాధించే విధంగా ప్రయత్నం చేద్దామన్నారు. అన్ని పార్టీలు బీసీ రిజర్వేషన్ కు అసెంబ్లీలో తమ సంపూర్ణ మద్దతును తెలియజేశాయని, పార్టీలకతీతంగా ఈ బందును సక్సెస్ చేయగలరని కోరారు. ఈ కార్యక్రమంలో కళ్యాణ్ కర్ నరసింహారావు, మరికంటి కనకయ్య ముదిరాజ్, గుంటుకు శీను ముదిరాజ్, నాగపురి రమేష్, గడియారం స్వామి చారి, సందబోయిన ఎల్లం, ముత్యాల విఠలాచారి, నాగపురి బాబు, బండ్ల స్వామి, కుమ్మరి పోచయ్య సుధాకర్, కొమ్ము నరేష్ యాదవ్, దండే యాదగిరి, కుమ్మరి యాదగిరి, రామ్గారి శ్రీధర్, చిక్కుడు ప్రసాద్ ముదిరాజ్, కానుగుల రమణకర్ తదితరులు పాల్గొన్నారు.