22-07-2025 12:26:25 AM
టాలీవుడ్ స్టార్ రామ్‌చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజాచిత్రం ‘పెద్ది’. దర్శకుడు బుచ్చిబాబు సానా కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఫిక్షనల్ కథతో క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మైత్రిమూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్ గౌర్నాయుడు పాత్రలో, జగపతిబాబు, దివ్యేందుశర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ చిత్రానికి సంబంధించి ఓ లెన్తీ షెడ్యూల్ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా మేకోవర్ అయిన రామ్‌చరణ్ ఈ కీలకమైన షెడ్యూల్‌లో పాల్గొననున్నారు. ఆకర్షణీయమైన కండలు తిరిగిన శరీరాకృతితో అభిమానులను అలరించేందుకు తనను తాను తీర్చిదిద్దుకుంటున్నట్టు తెలుస్తోంది. తాజా రామ్‌చరణ్ జిమ్‌లో వర్కవుట్స్ చేస్తుండగా తీసిన ఫోటోను ఆయనే స్వయంగా సోషల్‌మీడియాలో పంచుకున్నారు.
ఇందులో గుబురు గడ్డం, వెనుక భాగంలో ముడివేసిన జుట్టు, దృఢమైన శరీరంతో ఆయన లుక్ ఆకట్టుకుంటోంది. ఈ ఫోటోను షేర్ చేసిన ఆయన “పెద్ది’ కోసం ఇలా మారుతున్నా. దృఢమైన సంకల్పం.. గొప్ప ఆనందం” అనే క్యాప్షన్ పెట్టారు. తమ అభిమాన హీరోకు సంబంధించి ఈ న్యూలుక్ ఫొటోను అభిమానులు షేర్ చేస్తుండటంతో వైరల్‌గా మారింది. 2026, మార్చి 27న ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్; డీవోపీ: ఆర్ రత్నవేలు; ఎడిటర్: నవీన్ నూలి; ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా.