15-11-2025 12:00:00 AM
సిద్దిపేట క్రైం, నవంబర్ 14 : బాణమతి ద్వారా జబ్బులను నయం చేస్తానంటూ అమాయక ప్రజలను మోసగిస్తున్న వ్యక్తపై కేసు నమోదు చేసినట్టు సిద్ధిపేట టూటౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ చెప్పారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. సిద్దిపేటలోని శంకర్ నగర్ కు చెందిన చాట్లపల్లి రాజయ్య అనే వ్యక్తి కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నాడు.
జబ్బు నయం కాకపోవడంతో ఇందిరానగర్కు చెందిన ఎంఎన్ రహీముద్దీన్ అలీ అనే వ్యక్తి ఆశ్రయించాడు. మంత్ర శక్తితో ఎటువంటి జబ్బునైనా నయం చేస్తానని రాజయ్యను రహీముద్దీన్ నమ్మించాడు. రాజయ్య వద్ద నుంచి రూ.45వేలు తీసుకొని తన ఇంటిలో ఏవో మంత్రాలు చదివి ఇక నయం అవుతుందని చెప్పి పంపించాడు. రోజులు గడిచినా జబ్బు నయం కాకపోవడంతో, తన డబ్బు తిరిగి ఇవ్వాలని రాజయ్య రహీముద్దీన్ను అడిగాడు.
దాంతో రాజయ్యను చంపుతానని రహీముద్దీన్ బెదిరించాడు. ఈ విషయం బాధితుడు ఈనెల 12న టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శుక్రవారం రహీముద్దీన్ ను అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచారు. నిందితుడికి న్యాయస్థానం రిమాండ్ విధించింది.