18-10-2025 12:00:00 AM
రూ.2 లక్షల మేర నష్టం
సిర్పూర్ (యు), అక్టోబర్ 17 (విజయక్రాంతి): లింగాపూర్ మండలంలోని ఎల్ల పటార్ గ్రామంలో గురువారం ఓ అలుడు భార్యపై ఉన్న కోపంతో అత్తారింటికి నిప్పంటించాడు. ఈ ఘటనలో ఇంటి పైకప్పుతో పాటు ఇంట్లో ఉన్న వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, ఎల్లపటార్కు చెందిన అబ్జల్బీ భర్త కొంతకాలం క్రితం మృతి చెందారు. ఆమె తన కూతురిని జైనూర్ మండలానికి చెందిన ముజాయిజ్ బేగ్ అనే యువకునికి తొమ్మిది నెలల క్రితం పెళ్లి చేశారు.ముజాయిజ్ మద్యానికి బానిసై తరచూ భార్యను వేధించేవాడిగా తెలిసింది.
ఈ పరిస్థితుల్లో అతని భార్య 15 రోజుల క్రితం తన పుట్టింటికి వచ్చేసింది.గురువారం మధ్యాహ్నం మద్యం సేవించి వచ్చిన ముజాయిజ్, ఎల్లపటార్లోని అత్తారింటికి చేరి కత్తితో తల్లి-కూతుళ్లపై దాడికి యత్నించాడు. వారు భయంతో ఇంటి నుండి బయటకు పరుగెత్తారు.
అనంతరం ఇంట్లోకి ప్రవేశించిన ముజాయిజ్, గ్యాస్ సిలిండర్ లీక్ చేసి నిప్పు పెట్టాడు. మంటలు తీవ్రమై ఇంటి పైకప్పుతో పాటు అందులోని సామానంతా కాలిపోయాయి. ఈ ఘటనలో బాధిత కుటుంబా నికి సుమారు రూ.2 లక్షల మేర ఆర్థిక నష్టం జరిగిందని గ్రామస్తులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.