24-07-2025 12:52:55 AM
ఆ గ్రామాల్లో సర్వే మ్యాప్, భూధార్ అమలు చేస్తాం: మంత్రి పొంగులేటి
హైదరాబాద్, జూలై 23 (విజయక్రాంతి): దశాబ్దాలుగా రాష్ర్టంలో నక్షా లేని 413 గ్రామాలకుగాను 5 గ్రామాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన రీసర్వేను విజయవంతంగా పూర్తిచేశామని వీలైనంత త్వరితగతిన ఆ గ్రామాల్లో సర్వే బౌండరీస్ యాక్ట్ ప్రకారం నక్షా పటాలు తయారుచేస్తామని రాష్ర్ట రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. బుధవారం సచివాలయంలో రీసర్వేపై సీఎం ముఖ్యకార్యదర్శి శేషాద్రి, రెవెన్యూ శాఖ కార్యదర్శి వీ లోకేశ్‌కుమార్, సర్వే ల్యాండ్ సెటిల్‌మెంట్ కార్యదర్శి రాజీవ్‌గాంధీ హనుమంతుతో కలిసి సమీక్ష నిర్వహించారు. నిజాం కాలం నుంచి 413 గ్రామాలకు నక్షాలు లేకపోయినా గత ప్రభుత్వం ఆ గ్రామాలను గాలికి వదిలేసిందన్నారు.
దీనికి పరిష్కారం చూపాలన్న లక్ష్యంతో ప్రయోగాత్మకంగా మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం సలార్‌నగర్, జగిత్యాల జిల్లా భీర్పూర్ మండలం కొమ్మనాపల్లి, ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమడ, ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూగురు, సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం షాహిద్‌నగర్ గ్రామాల్లో డ్రోన్, ఏరియల్, ప్యూర్ గ్రౌండ్ ట్రూతింగ్ రోవర్ పద్ధతుల్లో సర్వే నిర్వహించామని తెలిపారు.
నిబంధనల ప్రకారం భూయజమానులకు నోటీసుల జారీ చేసి గ్రామసభలు నిర్వహించి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని ప్రతి ఒక్కరి భూములకు సర్వేహద్దులను ఖరారు చేస్తామన్నారు. ఈ గ్రామాల్లోని అనుభవాలతో మిగిలిన గ్రామాల్లో కూడా రీసర్వే నిర్వహించాలని ఆదేశించారు. భూములకు భూధార్ నెంబర్ కేటాయించాలని భూభారతి చట్టంలో పేర్కొన్నట్లుగా..ఈ 5 గ్రామాల్లో అమలుచేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. సమావేశంలో సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య, సర్వే ల్యాండ్ సెటిల్‌మెంట్ జాయింట్ డైరెక్టర్ ప్రసన్న లక్ష్మి, 5 గ్రామాల పరిధిలోని ఆర్డీవోలు, తహసీల్దార్లు, సర్వే ల్యాండ్ సెటిల్‌మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్లు పాల్గొన్నారు.