24-07-2025 12:51:38 AM
వెంకటాపురం నూగూరు, జూలై 23( విజయ క్రాంతి): గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పాలెం వాగు జల కళను సంతరించుకుంది. వెంకటాపురం మండలంలో కురిసిన భారీ వర్షానికి తోడు చత్తీస్గడ్ రాష్ట్రంలోని ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో పాలెం వాగుకు వరద పోటెత్తింది.
వరద నీటిమట్టం ప్రాజెక్టుకు పూర్తిస్థాయికి దగ్గరగా చేరడంతో ఎప్పుడు ఎటువంటి పరిస్థితి ఎదురవుతుందని ప్రాజెక్టు దిగివని ఉన్న గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఈ ప్రాజెక్టు నిర్మాణ దశలోనే వరుసగా రెండు సంవత్సరాలు మట్టికట్ట కొట్టుకుపోయి చుట్టుపక్కల గ్రామాలు జలమయమైన సంఘటనలు ఉన్నాయి.
దిగువ ప్రాంతంలోని పంట పొలాలు ఇసుకమేటలు వేసి రెండు సంవత్సరాలపాటు ఆ ప్రాంతంలోని రైతులు పంటలు వేయలేని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మళ్ళీ ప్రాజెక్టు నీటిమట్టం అంతే తీవ్రస్థాయిలో ఉండగా పలుచోట్ల గేట్ల వద్ద లీకేజీ కారణంగా ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉందనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతున్నానని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.