calender_icon.png 26 July, 2025 | 5:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏపీ జలజగడం

25-07-2025 12:57:26 AM

  1. నాగార్జునసాగర్‌పై ఆంధ్రా అధికారుల జులుం
  2. కుడికాల్వకు నీరు విడుదల 
  3. అనుమతి లేదంటున్న తెలంగాణ అధికారులు
  4. కుడి కాల్వకు నీళ్లు ఆపాల్సిందే 
  5. కేఆర్‌ఎంబీకి ప్రభుత్వం ఫిర్యాదు

నాగార్జునసాగర్, జూలై 24 (విజయక్రాంతి): నాగార్జున సాగర్ కుడి కాల్వకు ఏపీ ఇరిగేషన్ శాఖ అధికారులు నీటిని విడుదల చేయడం ఇప్పుడు మరో వివాదానికి దారి తీసింది. కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు(కేఆర్‌ఎంబీ)కు సమాచా రం అందించకుండా నీటిని విడుదల చేయడంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలుపుతోంది. ఏపీ అక్రమ నీటి తరలింపుపై తెలంగాణ నాగార్జున సాగర్ ప్రాజెక్టు అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీ అధికారుల తీరుపై కేఆర్‌ఎంబీకి ఫిర్యాదు చేశారు. కుడికాలువకు నీటి విడుదల విషయంలో ఏపీ అధికారులు కేఆర్‌ఎంబీ నుంచి ఎలాంటి అనుమతు లు తీసుకోలేదని, సమాచారం ఇవ్వకుండానే నాగార్జునసాగర్ డ్యాం కుడికాల్వకు ఆంధ్రా అధికారులు బుధవారం నీటి విడుదల చేశారని తెలిపారు. అనుమతి తీసుకోకుండా అక్రమంగా నీళ్లను తరలిస్తుందని తెలంగాణ అధికారులు ఆరోపి స్తున్నారు.

నీటి చౌర్యంపై ఇరిగేషన్ ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఏపీ నీటి కుట్రలపై కేఆర్‌ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వా త తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీలు కొనసాగుతూనే ఉన్నాయి.

అప్పట్లో ఏపీ సీఎం చంద్రబాబు- తెలంగాణ సీఎం కేసీఆర్‌తో తొలిసారి భేటీ కాగా.. ఆ తర్వాత.. జగన్-, కేసీఆర్ సమావేశమయ్యారు.. తాజాగా చంద్రబాబు,- రేవంత్‌రెడ్డి మీట్ అయ్యారు. మూడుసార్లు కూడా విభజన సమస్యలే అజెండాగా సమావేశాలు నిర్వహించి చర్చించారు. 

పులిచింతలతో మొదలు

ఐదేండ్లుగా కృష్ణా జలాల వివాదాలను పరిశీలిస్తే.. తొలుత పులిచింతల కేంద్రంగా వివాదం ముదిరి, అది కాస్తా ప్రాజెక్టులను బోర్డులకు అప్పగిస్తూ కేంద్రం గెజిట్ జారీ చేసే దాకా వెళ్లింది. అవసరం లేకున్నా పులిచింతలలో జలవిద్యుత్తు ఉత్పాదన చేస్తూ నీటిని వృథాగా సముద్రంలోకి వదలడానికి తెలంగాణ కారణమవుతోందని ఏపీ సర్కారు కేంద్రానికి ఫిర్యాదు చేసింది.

దీనిపై పదేపదే ఒత్తిడి తేవడంతో రెండేళ్ల కిందట కృష్ణా, గోదావరి ప్రాజెక్టులను ఆయా బోర్డులకు అప్పగించాలని కోరుతూ కేంద్రం గెజిట్ విడుదల చేసింది. అయితే గెజిట్ విడుదలైనా ప్రాజెక్టులేవీ బోర్డుల చేతికి వెళ్లలేదు. ఆ తర్వాత శ్రీశైలం భూగర్భ జలవిద్యుత్తు కేంద్రంలో విద్యుత్తు ఉత్పాదనపై వివాదం నడిచింది. తాజాగా నాగార్జునసాగర్ కేంద్రంగా వివాదం రాజుకుంది. నీటి పంపిణీపై కూడా వివాదం సమసిపోలేదు. 

నీటి పంపకం అపెక్స్ కౌన్సిల్‌కు

2015--16 వాటర్ ఇయర్‌కు ముందు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఉమాభారతి నేతృత్వంలో జరిగిన సమావేశానికి తెలంగాణ సీఎం గైర్హాజరు కాగా, ఆ సమావేశంలో కృష్ణా జలాలను చెరిసగం కాకుండా 811 టీఎంసీల్లో 299 టీఎంసీలు (37 శాతానికే) తెలంగాణ ఒప్పుకోవడం విమర్శలకు తావిచ్చింది.

అయితే ఆ నిర్ణయాలు క్రమంగా 2017 దాకా కొనసాగగా.. ఆ తర్వాత వాటా మేరకు నీటిని వాడుకోలేదు. దీంతో 37 శాతం నుంచి 34 శాతానికి తెలంగాణ అధికారులే కుదించుకుంటూ 66 శాతం ఏపీకి, 34 శాతం తెలంగాణకు ఇస్తే చాలని ఒప్పుకొన్నారు. 2015లో జరిగిన ఒప్పందం ఆ ఒక్క వాటర్ ఇయర్‌కే పరిమితమైనా 2022--23 దాకా కొనసాగింది.

2023--24 వాటర్ ఇయర్‌లో కృష్ణా నీటి పంపకాల వివాదం తేలలేదు. నీటిని పంచే బాధ్యతను అపెక్స్ కౌన్సిల్‌కు అప్పగిస్తూ బోర్డు తీర్మానం చేసింది. ఈలోగా త్రిసభ్య కమిటీ తెలుగు రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా నీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాలని బోర్డు తీర్మానించింది

కేఆర్‌ఎంబీని బేఖాతరు చేయని ఏపీ

నాగార్జునసాగర్ డ్యాం కుడికాల్వకు ఆంధ్రా  అధికారులు బుధవారం నీటి విడుదల చేశారు.  కృష్ణా నది బోర్డు అనుమ తులతో మాత్రమే నీటి విడుదల చేయ ల్సి ఉండగా, బోర్డు అనుమతులను తీసుకున్నట్లు వారికి ఎటువంటి సమాచారం లేదని తెలంగాణకు చెందిన నాగార్జునసాగర్ డ్యాం అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు శ్రీశైలం డ్యాం నిర్వహణ ఆంధ్రాకు, నాగార్జునసాగర్ డ్యాం నిర్వహణ తెలంగాణకు అప్పగించారు. 

2023 నవబంర్ 30న ఆంధ్రా అధికారులు నాగార్జు నసాగర్ డ్యాంపైకి పోలీస్ బలగాలతో ప్రవేశించి 13వ గేట్ నుంచి 26వ గేట్ వరకు తమ అధీనంలోకి తీసుకుంటూ, కుడికాల్వ నిర్వహణను కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అప్పటి నుంచి ఆంధ్రా అధికారులు తమకు కావాల్సినప్పుడు, కేఆర్‌ఎంబీ సూచనలు కూడా పాటించకుండా కుడికాల్వకు నీటి విడుదలను చేపడుతూ వస్తున్నారు. దీంతో ఇరురాష్ట్రాల మధ్య వివాదం నెలకొంది.

ఈ నేపథ్యంలో సాగర్ నీటి విడుదల సమస్యను పరిష్కరించేందుకు కేఆర్‌ఎంబీ ముందుకొచ్చింది. అప్పటినుంచి సాగర్ భద్రత, ప్రాజెక్టు నిర్వహణ, నీటి వాటాల పంపకం, మరమ్మతుల వంటి విషయంలో కేఆర్‌ఎంబీ తీసుకునే ఆదేశాలు, నిర్ణయాలను రెండు తెలుగు రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. అంతేకాక వివాదాన్ని పరిష్కరించే క్మ్రంలో నీటి వాటాలను ఇరురాష్ట్రాలకు కేటాయించారు.

కానీ బుధవారం ఏపీ అధికారులు ఏకపక్షంగా కేఆర్‌ఎంబీ నిబంధనలు ఉల్లంఘించి సాగర్ కుడి కాలువకు నీటి వదిలేయంతో మరోసారి వివాదం రాజుకుంది. ఈ నేపథ్యంలో నీటి విడుదలను వెంటనే ఆపాలని కేఆర్‌ఎంబీకి తెలంగాణ నీటి పారుదల శాఖ అధికారులు ఫిర్యాదు  చేశారు. కాగా ప్రస్తుత కాంగ్రెస్ పాలకులు నాగార్జునసాగర్ డ్యాంపై ఉన్న పరిస్థితిని చక్కదిద్దడంలో పూర్తిగా విఫలం అవ్వడమే కాకుండా ఆంధ్రా పాలకులకు వత్తాసు పలుకుతున్నారని  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.