13-08-2025 04:10:21 PM
జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ
గద్వాల,(విజయక్రాంతి): జిల్లాలో మత్తు పదార్థాల బారిన పడకుండా అధికారులు కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మినారాయణ అన్నారు. బుధవారం ఐడీఓసీ సమావేశ హాలులో “మిషన్ పరివర్తన – మత్తు పదార్థాల వినియోగ నిర్మూలన కోసం సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మత్తు పదార్థాల వినియోగం వల్ల వ్యక్తిగత ఆరోగ్యం, ఆలోచనాశక్తి సామర్థ్యాన్ని దెబ్బతీసి ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని హెచ్చరించారు.
మాదకద్రవ్యాల క్రయవిక్రయాలు గుర్తిస్తే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని, అలాంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ సమస్య గ్రామీణ ప్రాంతాల వరకు వ్యాప్తి చెందుతున్నందున, గ్రామీణ యువకులు బానిసత్వానికి గురి కాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిల్లల్లో ప్రవర్తనలో మార్పులు గమనించిన వెంటనే కౌన్సిలింగ్ అందించాలన్నారు.