calender_icon.png 13 August, 2025 | 5:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీ వర్ష సూచన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

13-08-2025 04:05:32 PM

భారీ వర్ష సూచన నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

జిల్లా కలెక్టర్ బి. యం. సంతోష్

గద్వాల,(విజయక్రాంతి): రానున్న 72 గంటలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికల నేపధ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్  సూచించారు.  భారీ వర్ష సూచనల నేపథ్యంలో ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా, సమర్ధవంతంగా ఎదుర్కొనేలా అధికారులు అన్ని విధాలుగా సన్నద్ధం అయి ఉండాలని సూచించారు. ఎక్కడ కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, మూగ జీవాలు ప్రాణాలు కోల్పోకుండా ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. 

అత్యవసర పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తున్నామని, అధికారులు, సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో విధుల్లో ఉంటూ, అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ యంత్రాంగం యావత్తు అండగా ఉందనే భరోసాను ప్రజలకు కల్పించాలని హితవు పలికారు.

భారీ వర్షాలతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అన్ని పీ.హెచ్.సీలు, ఆసుపత్రులలో సరిపడా మందుల స్టాక్ ను అందుబాటులో పెట్టుకుని, వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండేలా పర్యవేక్షణ చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు.భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లా యంత్రాంగం అన్ని విధాలుగా అప్రమత్తమై ఉన్నదని, ఎలాంటి పరిస్థితులు తలెత్తిన సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామని, ప్రజలు ఆందోళనకు గురి కావద్దని ఈ సందర్భంగా కలెక్టర్ బి.యం. సంతోష్ భరోసా కల్పించారు.