calender_icon.png 16 November, 2025 | 5:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జమ్మూకశ్మీర్‌లో భారీ పేలుడు

16-11-2025 12:00:00 AM

-9మంది మృతి.. 32మందికి గాయాలు

-పేలుడు పదార్థాల నమూనాలు సేకరిస్తుండగా విస్పోటనం

-300 మీటర్లు దూరంలో పడిన శరీర భాగాలు

-నౌగామ్ పోలీస్‌స్టేషన్ ధ్వంసం

-ఉగ్ర కుట్ర కాదు.. ప్రమాదమే

-జమ్మూకశ్మీర్ డీజీపీ నలిన్ ప్రభావత్ స్పష్టీకరణ

శ్రీనగర్, నవంబర్ 15 : ఉగ్ర కుట్రలు పెచ్చరిల్లుతున్న ప్రస్తుత తరుణంలో జమ్మూకశ్మీర్‌లో భారీ పేలుడు సంభవించడంతో దేశ ప్రజలు ఉలిక్కిపడ్డారు. జమ్మూకశ్మీర్‌లోని నౌగామ్ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం రాత్రి 11.22గంటల జరిగిన ఈ ఘటనలో 9మంది మృతిచెందగా 32మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు ఫోరెన్సిక్ నిపుణులు, రాష్ట్ర దర్యాప్తు సంస్థకు చెందిన ఒకరు, ఇద్దరు క్రైమ్ ఫొటోగ్రాఫర్లు, ఇద్దరు రెవెన్యూ అధికారులతో పాటు ఓ టైలర్ ఉన్నారు.

గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవ కాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. భారీ పేలుడుతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ ప్రాం తంలో దట్టమైన పొగ వ్యాపించింది. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. పేలుడు ధాటికి దాదాపు 300 మీటర్ల దూరంలో మృతుల శరీర భాగాలు పడినట్లు స్థానికులు తెలిపారు. పోలీస్‌స్టేషన్‌లోని పార్కింగ్ స్థలంలో ఉన్న పలు వాహనాలకు మంటలు అంటుకున్నాయి. 

విపత్తును నివారించామనుకుంటే.. విస్ఫోటనం

అధికారులు ఎంతో శ్రమించి ఇటీవల ఫరీదాబాదలో భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిం దే. విపత్తుని నివారించారని భావిస్తున్న తరుణంలో ఈ భారీ విస్ఫోటనం సంభవించి ప్రాణ నష్టం జరగడం అందరినీ ద్రిగ్భాంతికి గురిచేస్తోంది. హరియాణాలోని ఫరీదాబాద్‌లో ఉగ్ర మాడ్యూల్‌ను అధికారులు ఛేది స్తున్న క్రమంలో ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో పేలుడు జరిగి 13మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

ఐ20 కారు కారణంగానే పేలుడు జరిగిందని గుర్తించిన అధికారులు.. పలు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా డాక్టర్ ఉమర్ నబీ కారు నడిపినట్లు కనుగొన్నారు. ఈ పేలుడులో అతడు కూడా ప్రాణాలు కోల్పోయాడని డీఎన్‌ఏ పరీక్షలో నిర్ధారణ అయ్యింది. దీనిపై దర్యాప్తు కొనసాగుతుండగా జమ్మూకశ్మీర్‌లో పేలుడు చోటు చేసుకోవడం అందరినీ కలచివేస్తోంది. 

ఉగ్రకుట్ర కాదు.. ప్రమాదమే : డీజీపీ

జమ్మూకశ్మీర్‌లోని నౌగామ్ పోలీస్‌స్టేషన్‌లో భారీ పేలుడు వెనుక ఉగ్ర కుట్ర ఉందంటూ వస్తున్న ఊహాగానాలను జమ్మూకశ్మీర్ డీజీపీ నలిన్ ప్రభావత్ కొట్టిపారేశారు. ఇది ప్రమాదమే అని స్పష్టం చేశారు. పేలుడు ఘటనపై డీజీపీ మీడియాతో మాట్లాడారు. ‘నౌగామ్ పోలీస్ స్టేషన్ ఓపెన్ ఏరియాలో పేలుడు పదార్థాలు ఉంచాం.. ప్రక్రియలో భాగంగా ఫోరె న్సిక్ నిపుణులకు అప్పగించాం.గత రెండు రోజుల నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతోం ది.

నమూనాల సేకరణ చాలా జాగ్రత్త గా నిర్వహించారు. పేలుడు పదార్థాలకు సున్నితమైన గుణం ఉంది. అయినప్పటికీ దురదృ ష్టవశాత్తు 11.20 గంటలకు ప్రమాదం జరిగింది. దీనిపై ఎలాంటి ఊహాగానాలు వద్దు. ఈ ఘటనలో 9మంది చనిపోయారు. 32మంది పోలీసులు గాయపడ్డారు. పేలు డు కారణంగా చుట్టు పక్కల ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈ ఘటనపై దర్యాప్తు కొనసా గిస్తున్నాం’. అని వెల్లడించారు. 

పేలుడు ఎలా జరిగిందంటే..?

ఫరీదాబాద్‌లోని డాక్టర్ ముజామిల్ షకీల్ ఇంట్లో హరియాణా, జమ్మూకశ్మీర్ పోలీసులు ఇటీవల సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. అక్కడ 3వేల కిలోల పేలుడు పదార్థాలతో పాటు పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని జమ్మూకశ్మీర్‌లోని నౌగామ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వాటి నుంచి నమూనాలను సేకరిస్తుండగా పేలు డు సంభవించిందని అధికారులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.