16-11-2025 12:00:00 AM
ఒకరు27, మరొకరు 30, ఇంకొకరు 95 ఓట్ల తేడాతో విజయం
పాట్న, నవంబర్ 15: బీహార్ ఎన్నికల్లో అతితక్కువ మెజార్టీతో కొందరు అభ్యర్థులు విజయాన్ని ముద్దాడారు. చివరి క్షణం వరకూ ‘గెలుపు నీదా నాదా ’ అన్నట్లు ఆధిక్యం వచ్చినా.. చాలా తక్కువ ఓట్ల తేడాతో కొందరు ఓడిపోయారు. మూడు స్థానాల్లో అయితే మెజార్టీ 100 లోపే ఉన్నది. బీహార్ ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ ఒక్క సీటు సాధించింది.
కేవలం 30 ఓట్ల తేడాతో గెలుపొందడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ ఎన్నికల్లో 243 సీట్లకు గాను 192 స్థానాల్లో మాయావతి పార్టీ పోటీ చేసింది. కానీ ఒక్క చోటనే గెలిచింది. ఆ పార్టీకి చెందిన సతీశ్ కుమార్ యాదవ్ రామ్‌గఢ్ అసెంబ్లీ స్థానంలో కేవలం 30 ఓట్లతో గెలిచారు. ఆయనకు 72,689 ఓట్లు రాగా సమీప బీజేపీ అభ్యర్థి అశోక్‌కుమార్ సింగ్‌కు 72,659 ఓట్లు దక్కాయి.
అలాగే భోజ్‌పుర్ జిల్లాలోని సందేశ్ స్థానంలో జేడీయూ అభ్యర్థి రాధాచరణ్‌షా 27 ఓట్ల మెజార్టీతో విజయం పొందారు. అర్రాలోని అగియాన్ ప్రాంతంలో 95 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి మహేశ్ పాస్వాన్, నబీనగర్‌లో జేడీయూ అభ్యర్థి చేతన్ ఆనంద్ 112 ఓట్ల తేడాతో, ఢాకాలో ఆర్జేడీ అ్యర్థి ఫైసల్ రెహమాన్ 178 ఓట్ల తేడాతో, ఫోర్బస్‌గంజ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మనోజ్ బిశ్వాన్ 221 ఓట్లతో గెలిచారు.
రెబల్స్‌పై బీజేపీ వేటు
-మాజీ మంత్రితో సహా మరో ఇద్దరి సస్పెండ్
బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి గెలిచిన తర్వాత బీహార్ బీజేపీ రెబల్స్‌పై ఆ పార్టీ వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన మాజీ కేంద్ర మంత్రితో పాటు మరో ఇద్దరిని శనివారం బహిష్కరించింది. అంతర్గత అసమ్మతికి చెక్ పెట్టేలా పార్టీలోని ఇతరులను కూడా సస్పెండ్ చేసింది. మాజీ కేంద్ర విద్యుత్ మంత్రి, మాజీ ఎంపీ ఆర్‌కే సింగ్‌ను ఆరు సంవత్సరాల పాటు బహిష్కరించింది. ఆయన ‘పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ.. సంస్థాగత క్రమశిక్షణను పదేపదే ఉల్లంఘించారని ఆరోపించింది. ఎంఎల్‌సీ అశోక్ కుమార్ అగర్వాల్, కతిహార్ మేయర్ ఉషా అగర్వాల్‌ను కూడా సస్పెండ్ చేసింది. ఆర్‌కే సింగ్‌పై వేటు వేసిన కొన్ని గంటలలోనే పార్టీ అతని ప్రాథమిక సభ్యత్వంను కూడా రద్దు చేసింది.
గెలవని బీహార్ ‘సింగం’
-రెండు స్థానాల్లోనూ మాజీ ఐపీఎస్ శివదీప్ ఓటమి
బీహార్ ఎన్నికల్లో మాజీ ఐపీఎస్, పోలీస్ శాఖలో సింగం, ఫైర్‌బ్రాండ్‌గా పేరొందిన శివదీప్ వామనరావ్ లాండే(49) గెలువలేకపోయారు. రాజకీయాల్లోకి వచ్చి అందరి దృష్టిని ఆకర్షించినా విజయాన్ని మాత్రం పొందలేకపోయారు. అరారియా, జమల్‌పూర్ స్థానాల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. కానీ రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు. జమల్‌పూరర్‌లో జేడీయూ అభ్యర్థి నచికేతా మండల్, అరారియాలో కాంగ్రెస్ అభ్యర్థి అబిదుర్ రెహమాన్ గెలిచా రు. 2006 బ్యాచ్‌కు చెందిన ఆయన 2024 లో ఐపీఎస్‌కు రాజీనామా చేశారు. పాట్నా ఎస్పీగా చేసిన సమయంలో వీధి రౌడీల విషయంలో కఠినంగా వ్యవహరించారు.
గెలిచినా ఓడినా ప్రజాసేవలోనే.. బీహార్ ఓటమి తర్వాత ఆర్జేడీ తొలి స్పందన
గెలిచినా ఓడినా ప్రజాసేవలోనే ఉంటామని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) పేర్కొంది. ఒడుదుడుకులు ఎదు రైనా ప్రజాక్షేత్రంలోనే ఉంటామని తెలిపింది. ఈ మేరకు శనివారం బీహా ర్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన ఆర్జేడీ ఎక్స్‌లో ఒక ప్రకటన విడుదల చేసిం ది. ‘ప్రజాసేవ అనేది నిరంతర ప్రక్రియ, అంతులేని ప్రయాణం. దానిలో హెచ్చుతగ్గులు వస్తుంటాయి. ఓటమిలో దుఃఖం లేదు, విజయంలో అహంకారం లేదు.
రాష్ట్రీయ జనతాదళ్ పేదల పార్టీ. పేదల పక్షాన తన గొంతును పెంచుతూనే ఉంటుంది’ అని పేర్కొంది. ఆర్జేడీ తన బీహార్ ఓటమిని సుదీర్ఘ రాజకీయ పోరాటంలో భాగమని అభివర్ణించింది. ఎన్నికల్లో 25 సీట్లు సాధించింది. మరోపక్క అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, జైరాం రమేష్, అజయ్ మాకెన్, ఏఐసీసీ బీహార్ ఇన్‌చార్జ్ కృష్ణ అల్లవారు తో సహా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకత్వం శనివారం ఉదయం సమావేశాన్ని నిర్వ హించింది. బీహార్‌లో ఘోర పరాజయంపై సమీక్షించింది.
పాలిటిక్స్‌కు గుడ్‌బై: కుమార్తె ఆచార్య రోహిణి సంచలన నిర్ణయం
రాజకీయాలకు గుడ్‌బై చెప్పుతున్నాని, కుటుంబంతో సంబంధాలను కూడా తెంచుకుంటున్నాని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె ఆచార్య రోహిణి పేర్కొంది. ఈ మేరకు ఆమె ఎక్స్‌లో శనివారం పోస్టు చేసింది. ఆమె నిర్ణయం బీహార్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. లాలూ కుటుంబంలో ఫలితాల మరుసటి రోజే విభేదాలు బయటపడ్డాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
వృత్తి రీత్యా వైద్యురాలైన రోహిణి ఆచార్య, లాలూ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేగీ మాజీ సభ్యురాలు. ఆమె 2024 లోక్సభ ఎన్నికల్లో బీహార్‌లోని సరన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయింది. తాను ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక తేజస్వి యాదవ్ సహాయకుడు సంజయ్ యాదవ్, ఆమె భర్త రమీజ్ ఆలం పాత్ర ఉందని ఆమె ఆరోపించారు. అన్ని విమర్శలకు బాధ్యత వహిస్తానని పేర్కొన్నారు. రోహిణి లాలూప్రసాద్, రుబ్రీ దేవిల నాలుగో సంతానం. లాలూ మిత్రుడు, ఇన్‌కమ్ ట్యాక్స్ రిటైర్డ్ అధికారి రాయ్ రణవిజయ్ సింగ్ కుమారుడు సమరేశ్ సింగ్‌ను ఆమె పెళ్లి చేసుకుని, అమెరికాలో స్థిరపడ్డారు.