18-07-2025 01:12:02 AM
రూ.6.25 కోట్లు ఐటీసీ కొట్టేసిన నిందితుడు
హైదరాబాద్, జులై 17 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో భారీ జీఎస్టీ మోసం కేసు బయటపడింది. బాలా కార్పొరేషన్ యజమాని నాసరి వినోద్ కుమార్ మోసపూరిత జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసి, దానిని ఉపయోగించి రూ. 6.25 కోట్ల నకిలీ ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటీసీ) పొందారని వాణిజ్య పన్నుల అధికారులు గురువారం ఆరోపించారు. పంజాగుట్ట డివిజన్ పరిధిలోని ఖైరతాబాద్, సోమాజిగూడ సర్కిల్ 1 యొక్క ఉనికిలో లేని చిరునామాకు సంబంధించిన నకిలీ విద్యుత్ బిల్లులతో కంపెనీ జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ను పొందిందని అధికారులు చెప్పారు.
బొమ్మలు, వీడియో గేమ్‌లను వర్తకం చేయడానికి నమోదు చేసుకున్నప్పటికీ, కంపెనీ మార్చి మరియు ఏప్రిల్ 2025లో సిమెంట్, రాగి పైపులు, ప్లువుడ్ వంటి సంబంధం లేని వస్తువుల కోసం 1,268 వరకు ఇ-వే బిల్లులను సృష్టించిందన్నారు. బాలా కార్పొరేషన్ మోసపూరితంగా రూ. 6.25 కోట్ల ఐజీఎస్టీ ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్‌ను పొందిందని, సీజీఎస్టీ కింద అదే విలువ కలిగిన తప్పుడు ఐటీసీ 32 ఇతర వ్యాపారాలకు బదిలీ చేసిందని దర్యాప్తులో తేలిందన్నారు. ఇది సీజీఎస్టీ/టీజీఎస్టీ చట్టం, 2017లోని సెక్షన్లు 16(2),122లను నేరుగా ఉల్లంఘించిందన్నారు. అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ నాగిరెడ్డి క్షేత్ర తనిఖీ చేశారన్నారని, జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేశామన్నా రు.