24-07-2025 08:07:05 PM
మందమర్రి (విజయక్రాంతి): ఏరియాలోని కేకే-5 గనిలో కోల్ కట్టర్ గా విధులు నిర్వహిస్తూ, ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మోకనపల్లి లక్ష్మణ్ కుటుంబ సభ్యులకు మ్యాచింగ్ గ్రాంట్ చెక్కును అందజేశారు. గురువారం గని ఆవరణంలో నిర్వహించిన కార్యక్రమంలో కేకే గ్రూప్ ఏజెంట్ డి రాంబాబు హాజరై, లక్ష్మణ్ కుటుంబ సభ్యులకు 15 లక్షల రూపాయల 80 వేల రూపాయల మ్యాచింగ్ గ్రాంట్ చెక్కును అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మృతునికి సింగరేణి నుండి ఏడు లక్షల 50 వేల రూపాయలు, అదేవిధంగా ఉద్యోగుల నుండి సేకరించిన ఏడు లక్షల 80 రూపాయలు మొత్తం కలిపి 15,80,000 చెల్లించడం జరిగిందన్నారు.
వీటిలో సింగరేణి సంబంధించిన 7 లక్షల 50 వేల రూపాయలను ఫిక్స్ డిపాజిట్ చేసి అందించామన్నారు. డబ్బులను జాతీయ బ్యాంకులో పొదుపు చేసుకుని కుటుంబ అవసరాలకు మాత్రమే వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గని మేనేజర్ శంభూనాథ్ పాండే, గుర్తింపు కార్మిక సంఘం ఏఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ, జాయింట్ కార్యదర్శి కంది శ్రీనివాస్, గని రక్షణ అధికారి రమేష్, సంక్షేమ అధికారిని ఏ రవళి, ఏఐటియుసి గని పిట్ కార్యదర్శి గాండ్ల సంపత్ లు పాల్గొన్నారు.