27-11-2025 12:45:15 AM
మజ్దూర్ యూనియన్ వరంగల్ బ్రాంచ్ సెక్రెటరీ యుగంధర్ యాదవ్
మహబూబాబాద్, నవంబర్ 26 (విజయక్రాంతి): రైల్వే కార్మికుల పరిరక్షణ కోసం మజ్దూర్ యూనియన్ అహర్నిశలు కృషి చేస్తుందని వరంగల్ బ్రాంచ్ సెక్రటరీ ఆవుల యుగంధర్ యాదవ్ అన్నారు. మజ్దూర్ యూనియన్ వరంగల్ బ్రాంచ్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్మిక సంకల్ప యాత్ర గార్ల, గుండ్రాతి మడుగు, మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లలో నిర్వహించారు.
ఈ సందర్బంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు యూనియన్ నాయకుల దృష్టికి తీసుకుని వచ్చారు. పెట్రోలింగ్ హాట్స్, టూల్ రూముల నిర్మాణం చేపట్టాలని, మహబూబాబాద్ లో రైల్వే క్వాటర్స్ నిర్మాణం త్వరగా పూర్తి చేసి కార్మికులకి అందజేశాలని, వేసవి కాలంలో మంచినీటి వసతి కొరకు బోర్ వెల్స్ వేయించాలని కోరారు. గుండ్రాతి మడుగులో పని చేస్తున్న కార్మికులకు స్వంత ఇంటి చేరువలో ట్రాన్సఫర్ సౌకర్యం కల్పించాలని, బీడీ లైన్ కిమెన్ పోస్టింగ్ సీనియారిటి ప్రకారం ఇవ్వాలని కోరారు.
అధిక పని భారంతో మగ్గీపోతున్నామని, బ్రిటిష్ కాలం నాటి మ్యానువల్స్ మార్చేలా యూనియన్ తరుపున పోరాటం చేయాలని, మహిళా ఉద్యోగులకు పని భారం తగ్గించాలని యూనియన్ నేతలకు కార్మికులు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్బంగా మజ్దూర్ యూనియన్ సెక్రెటరీ యుగంధర్ యాదవ్ మాట్లాడుతూ కార్మికుల న్యాయమైన కోర్కెలు అధికారులతో చర్చించి పరిష్కారం అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మజ్దూర్ యూనియన్ చైర్మన్ ముకుందం, అసిస్టెంట్ సెక్రెటరీ బాబు రావు వైస్ చైర్మన్ రవీందర్, సుధాకర్, యూత్ సెక్రెటరీ భాస్కర్, మజ్దూర్ యూనియన్ సీనియర్ నాయకులు మహేష్, బాబు, రాజ్ కుమార్ పాల్గొన్నారు.