28-11-2025 12:00:00 AM
హనుమకొండ, నవంబర్ 27 (విజయ క్రాంతి): గ్రామపంచాయతీ రెండో సాధారణ ఎన్నికల నేపథ్యంలో హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సెంటర్ ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరీష్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. మీడియా సెంటర్లో చేసిన ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించి వివరాలను డిఆర్డిఓ మేన శ్రీను, ఇన్చార్జి డిపిఆర్‌ఓ అయూబ్ అలీని అడిగి తెలుసున్నారు.
మీడియా సెంటర్లో గ్రామపంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్, ఎన్నికల సంఘం నియమ నిబంధనలు, జిల్లాలో మండలాల వారీగా మూడు విడతల్లో జరగనున్న గ్రామపంచాయతీల ఎన్నికల షెడ్యూల్ వివరాలు, ఓటర్ల వివరాలు, పోలింగ్ కేంద్రాల వివరాలను అందుబాటులో ఉంచారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా సెంటర్ ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు అందించాలని సూచించారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఎంసిఎంసి సెల్ ద్వారా చెల్లింపు వార్తలను గుర్తించడం, సకాలంలో ప్రచార ప్రకటనలకు సంబంధించిన అనుమతులు మంజూరు చేయాలని సూచించారు.
సోషల్ మీడియాలో వచ్చే పోస్టులను గమనిస్తూ ఉండాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి అతిక్రమించిన పోస్టులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి మీడియా సహకారం అందించాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, ట్రైనీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత, ఇతర అధికారులు పాల్గొన్నారు.