28-11-2025 12:00:00 AM
గ్రామపంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు సెట్ కాన్ఫరెన్స్ ద్వారా పర్యవేక్షణ
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
నిజామాబాద్, నవంబర్ 27 (విజయ క్రాంతి): గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, నిర్వహించేందుకు నిజామాబాద్ సిపి సాయి చైతన్య జిల్లా పోలీస్ అధికారుల తోపాటు , ఎస్ హెచ్ ఓ లతో సెట్ కాన్ఫరెన్స్ లో పాల్గొని, ఎన్నికల భద్రత , శాంతి భద్రతా చర్యలు పర్యవేక్షించారు. సున్నిత ప్రాంతాలను గుర్తించి తగిన సూచనలు చేస్తూ అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు.
ఈ సందర్బంగా పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీ ఎన్నికల ప్రకటన వెలువడిన నేపథ్యంలో ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది అప్రమత్తతతో విధులు నిర్వహించాలని సూచించారు. జిల్లాలో ఎన్నికల నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని, ఎన్నికలలో ఓటర్లను ప్రభావితం చేయడానికి అక్రమంగా డబ్బు, మద్యం లేదా ఇతర పదార్థాలు రాకుండా చెక్పోస్టుల వద్ద ఇతర శాఖల సమన్వయంతో తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.విజిబుల్ పోలిసింగ్, నాకబందీలు, ఆకస్మిక తనిఖీలు నిరంతరం జరగాలని తెలిపారు.
ఎస్.హెచ్.ఓలు, వీ.పీ.వోలు ప్రతి గ్రామాన్ని సందర్శించి పోలింగ్ కేంద్రాలను పరిశీలించడంతో పాటు గ్రామాల్లో పెట్రోలింగ్ను మరింత బలోపేతం చేయాలని సూచించారు. సమస్యత్మక ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాలని అన్నారు. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు, ఇతరుల భావోద్వేగాలను దెబ్బతీసే విధమైన చర్యలపై ప్రత్యేక నిఘా ఉంచాలని పేర్కొన్నారు.
ప్రతీ సిబ్బంది ముందస్తు సమాచారం సేకరించాలని, అట్టి సమాచారం ఎప్పటి కప్పుడు తమ పై అధికారులకు తెలియజేయని అన్నారు. లాడ్జీలు, గెస్ట్ హౌసులు, కమ్యూనిటీ హాలులు, ఫంక్షన్ హాలుల్లో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ, అనుమానితుల కదలికలను పర్యవేక్షించాల న్నారు.ఎన్నికలకు సంబంధించిన అంశాల్లో, రాజకీయ కార్యకలాపాల్లో పోలీస్ సిబ్బంది ఎలాంటి ప్రమేయం ఉండకూడదని హెచ్చరించారు. విధుల్లో నిర్లక్ష్యం లేదా నిబంధనల ఉల్లంఘన చోటుచేసుకుంటే శాఖాపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
గత ఎన్నికల్లో వివాదాస్పద కేసుల్లో, అలాగే ఇతర కేసుల్లో నమోదైన రౌడీషీటర్లను బైండోవర్ చేసి వారికి కౌన్సిలింగ్ నిర్వహించాలని సూచించారు. నేటి నుంచి ప్రారంభమయ్యే నామినేషన్ ప్రక్రియ సందర్భంగా నామినేషన్ కేంద్రాల వద్ద పకడ్బందీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నామినేషన్ సమయంలో అనవసర గుమికూడేలా అనుమతించకూడదని, వాహనాలు మరియు అనుచరుల సంఖ్య నియమాల పరిధిలో ఉండేలా చూసుకోవాలని , కేంద్రం లోపల మరియు బయట సీసీటీవీ పర్యవేక్షణ తప్పనిసరి చేయాలని స్పష్టం చేశారు.
అభ్యర్థుల మధ్య ఘర్షణలు, వాగ్వాదాలు రాకుండా పోలీసులు ముందుగానే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సెట్ కాన్ఫరెన్స్లో పోలీస్ కమీషనర్ తో పాటు అదనపు డి. సి. పి శ్రీ బస్వా రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేష్, ఎలక్షన్స్ సెల్ ఇన్స్పెక్టర్ శ్రీ వీరయ్య, ఐటీ కోర్ సిబ్బంది సెట్ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా పోలీస్ అధికారులు పాల్గొన్నారు.