30-11-2024 11:26:06 PM
వైద్యశాలలపై ఆకస్మిక దాడులు
20 మంది నకిలీ వైద్యుల గుర్తింపు
కేసు నమోదు చేయనున్న అధికారులు
గజ్వేల్ (విజయక్రాంతి): గజ్వేల్ పట్టణంలో పలు వైద్యశాలపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ దాడులు ఉదయం నుంచి రాత్రి వరకు కొనసాగాయి. గజ్వేల్ లో వైద్య నిపుణులుగా చలామణి అవుతూ వైద్యం చేస్తున్న 20 మంది నకిలీ వైద్యులను అధికారులు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా 30 బృందాలుగా తనిఖీలు వేగవంతం చేసిన మెడికల్ కౌన్సిల్ అధికారులు గజ్వేల్ లో దాడులు చేయడంతో నకిలీ వైద్యులలో భయ కంపనాలు మొదలయ్యాయి. తెలంగాణ వైద్య మండలి సభ్యులు వైస్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్, ఎథిక్స్ కమిటీ మెంబర్ డాక్టర్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలోని యాంటీ క్వయిరీ బృందం గజ్వేల్ లోని పలు నకిలీ వైద్యుల క్లినిక్లపై తనిఖీలు నిర్వహించారు. పురుషోత్తం అనే నకిలీ వైద్యుడు తునికల్స గ్రామంలో హాస్పిటల్ నిర్వహిస్తూ గర్భం దాల్చడానికి సంబంధించిన ఓవలేటింగ్ ఏజెంట్ ఇంజక్షన్లు, ప్రొజెష్టిరాన్ హార్మోన్ ఇంజక్షన్లు, క్లోమిఫిసిట్రేట్ ఇంజక్షన్లు, ఐవి ఆంటీబయాటికులు, ఐవి స్టెరాయిడ్లు, మలేరియా ఇంజక్షన్లు యాంటీ డిప్రెసెంట్ మందులు ఇస్తున్నాడని గుర్తించారు.
గజ్వేల్ పట్టణంలో మణికంఠ క్లినిక్ లో స్వామి అనే నకిలీ వైద్యుడు నిర్వహిస్తున్న సాయి మణికంఠ చిల్డ్రన్ ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ పిల్లల ప్రథమ చికిత్స కేంద్రం, పల్స్ హాస్పిటల్ లో నకిలీ వైద్యులు రిఫర్ చేసినట్లుగా రికార్డు మైంటైన్ చేస్తున్నట్లు గుర్తించారు. ఆర్ అండ్ ఆర్ కాలనీ వేముల గట్టులో జితేంద్ర అనే మరో నకిలీ వైద్యుడు శ్రీ సాయి క్లినిక్ విచ్చలవిడిగా ఆంటిబయాటికులు ఇంజక్షన్స్ ఇస్తున్నారని గుర్తించారు. కిజికిస్తాన్ లో ఎంబిబిఎస్ కి సమానమైన వైద్య విద్యని అభ్యసించి ఆక్సి కేర్ హాస్పిటల్ లో ఎండి వైద్య నిపుణుడిగా ఓ వ్యక్తి చలామణి అవుతున్నట్లు గుర్తించారు. వీటితో పాటు ఓంవెంకట సాయి క్లినిక్ లో నకిలీ వైద్యులను గుర్తించారు. వీరి వద్ద హేతు బద్ధత లేకుండా రోగులకు ఇచ్చిన యాంటీబయాటిక్ ఇంజక్షన్లు వందల సంఖ్యలలో బయటపడగా, ఈ నకిలీ వైద్యులు అల్లోపతి వైద్యం చేస్తూ పట్టుబడ్డారు.
తనిఖీలలో విచ్చలవిడిగా ఆంటిబయోటిక్స్, స్టెరోయిడ్స్ ఇస్తునట్టు గుర్తించి తగు ఆధారాలు సేకరించారు. ఎన్ ఎంసి చట్టం 34,54 ప్రకారం వీరిపై కేసు నమోదు చేయనున్నారు. ఎన్ఎంసి చట్టం ప్రకారం విద్యార్హత లేకున్నా అల్లోపతి వైద్యం చేసినందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నారు. ఇలాంటి నకిలీ వైద్యులపై ఇప్పటివరకు 400 ఎఫ్ఐఆర్ లు నమోదయినాయి. త్వరలో కోర్టులో హాజరు పరిచి చట్టపరంగా శిక్షించబడతారు అని టీజీఎంసీ మెంబర్ డాక్టర్ బండారి రాజ్ కుమార్ తెలిపారు. చట్ట ప్రకారం అర్హత లేని వ్యక్తులకు ట్రైనింగ్ ఇవ్వడం, ప్రాక్టీస్ చేయడం చట్ట విరుద్దం అని గతంలో కూడా దేశంలో ఎక్కడ లేని విధంగా పలు సార్లు జి.ఒ లు ఇవ్వగా కోర్టు లు ఆ జి.ఒ లను రద్దు చేసిందని గుర్తు చేసారు. త్వరలో వీరందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కఠినంగా శిక్షించబడతారని, తెలంగాణ వైద్య మండలి 30 బృందాలు రాష్ట్రమంతట ప్రతి జిల్లాలలో, ప్రతి గ్రామంలో ఈ తనిఖీలు ఇలాగే కొనసాగుతాయి అని పరిమితి మించి వైద్యం చేసినట్టు గాని గుర్తిస్తే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడినందుకు కఠినంగా శిక్షించడంలో ఉపేక్షించేది లేదని టిజిఎంసి వైస్ చైర్మన్ డాక్టర్ జి శ్రీనివాస్, ఎథిక్స్ కమిటీ మెంబర్ డాక్టర్ కిరణ్ హెచ్చరించారు.