24-12-2025 06:51:28 PM
హనుమకొండ,(విజయక్రాంతి): వరంగల్‌లోని మెడికవర్ హాస్పిటల్ వైద్యులు అత్యంత క్లిష్టమైన మరియు ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక రోడ్డు ప్రమాద బాధితుడిని తమ అసాధారణ వైద్య నైపుణ్యంతో కాపాడి పునర్జన్మ ప్రసాదించారు. తీవ్రమైన గాయాలతో, అపస్మారక స్థితిలో ఆసుపత్రికి వచ్చిన బాధితుడికి కుడి కాలికి 'ఫ్లోటింగ్ నీ ఇంజరీ', ఎడమ చేతికి తీవ్రమైన ఫ్రాక్చర్, పక్కటెముకలు విరిగి ఊపిరితిత్తుల్లో రక్తం చేరడం వంటి అత్యంత సంక్లిష్ట సమస్యలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. విపరీతమైన రక్తస్రావం కారణంగా రోగి 'హైపోవోలెమిక్ షాక్'కు గురై, రక్తం గడ్డకట్టే సామర్థ్యం కోల్పోవడం, శ్వాసకోశ వైఫల్యం, బహుళ అవయవాల పనితీరు దెబ్బతినడం వంటి ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తాయి.
ఇలాంటి క్లిష్ట సమయంలో మెడికవర్ హాస్పిటల్స్ నిపుణుల బృందం ఏకీకృత 'గోల్డెన్ అవర్' ప్రోటోకాల్స్‌ను అమలు చేసి బాధితుడి ప్రాణాలను కాపాడడంలో విజయం సాధించింది. ఈ చికిత్స ప్రక్రియపై కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రత్న కార్తిక్ రెడ్డి మాట్లాడుతూ "రోగి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్న సమయంలో మేము 'డ్యామేజ్ కంట్రోల్ ఆర్థోపెడిక్స్' పద్ధతిని ఎంచుకున్నామనీ, మినిమల్లీ ఇన్వేసివ్ ఫిక్సేషన్ ద్వారా రక్తస్రావాన్ని అరికట్టి, విరిగిన ఎముకలను స్థిరీకరించడం ద్వారా రోగి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం నుండి తప్పించగలిగాము," అని వివరించారు.
ఈ చికిత్సలో భాగంగా రోగికి ఏకంగా 15 యూనిట్ల రక్త మార్పిడి చేయాల్సి వచ్చింది. ఐసీయూలో 22 రోజుల పాటు నిరంతర పర్యవేక్షణ అవసరమైన ఈ కేసులో, నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శ్రావణ్ కుమార్ జోగు, క్రిటికల్ కేర్ నిపుణులు డాక్టర్ లక్ష్మీ దీపక్, మరియు ఎమర్జెన్సీ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ సాధకృష్ణల బృందం సమన్వయంతో పనిచేసింది. "మల్టీ-ఆర్గన్ ఫెయిల్యూర్ వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా అత్యాధునిక లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ మరియు నిరంతర వైద్య పర్యవేక్షణ వల్లే బాధితుడిని కోలుకునేలా చేయగలిగాము," అని వైద్య బృందం పేర్కొంది. ఈ కార్యక్రమంలో హరినాథ్, రాజేశ్వర్ రెడ్డి, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.