24-12-2025 08:37:37 PM
జిల్లా ప్రధాన కార్యదర్శి పిడమర్తి భరత్
నూతనకల్,(విజయక్రాంతి): వచ్చే నెల 5, 6, 7 తేదీల్లో వరంగల్ జిల్లా కేంద్రంలో జరగబోయే PDSU 23వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి పిడమర్తి భరత్ పిలుపునిచ్చారు. బుధవారం మండల కేంద్రంలో మహాసభల పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతున్నా స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయడంలో విఫలమైందని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'నూతన విద్యా విధానం-2020' విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తోందని, పాఠ్యపుస్తకాల్లో అశాస్త్రీయ అంశాలను చేరుస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ హామీని ప్రభుత్వం అమలు చేయలేదని, కార్పొరేట్ ఫీజుల నియంత్రణకు చట్టం తీసుకురాలేదని భరత్ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రత్యేక విద్యాశాఖ మంత్రి లేకపోవడం శోచనీయమని, గురుకులాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో PDSU నాయకులు సందీప్, క్రాంతి, బన్నీ, రాజేష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.