calender_icon.png 12 July, 2025 | 8:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నియోజకవర్గ యువతకు ఉపాధి కల్పననే నా ధ్యేయం

12-07-2025 02:58:01 PM

ఖానాపూర్ మెగా జాబ్ మేళాకు భారీ స్పందన

 వేలాదిగా తరలివచ్చిన యువత

 ఖానాపూర్ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ భూక్య జాన్సన్ నాయక్

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ యువతకు భారీ ఎత్తున ఉపాధి కల్పించడమే తన ధ్యేయమని, అందుకోసం కంకణం కట్టుకొని జాబ్ మేళాలు నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నానని, బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్ అన్నారు. శనివారం ఖానాపూర్ పట్టణం ఏఎంకే ఫంక్షన్ హాల్ లో జాబ్ మేళా నిర్వహించారు. దీనికి నియోజకవర్గ యువతనే కాకుండా జిల్లా నలుమూలల నుంచి భారీ స్పందన కనిపించింది.

ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారే ఆరువేల మంది పైచిలుకు ఉండగా మరింత మంది జాబ్ మేళాకు నేరుగా తరలివచ్చారు. దీనికోసం సుమారుగా 67 కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించాయి. ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ, ఐటిఐ, బిఇ, బిటెక్, ఇతర ఫార్మసీ కోర్సులు చేసిన వారు ఈ జాబ్ మేళాలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. దీంతో నిరుద్యోగ తీవ్రత ఏ స్థాయిలో ఉందో చూచి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. యువత ఎంతగా నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతున్నారో పలువురు స్వయంగా వీక్షించారు.

ప్రభుత్వాలు స్పందించి నిరుద్యోగులకు అండగా నిలవాలని పలువురు మేధావులు వ్యాఖ్యానించడం అక్కడ కనిపించింది .ఈ కార్యక్రమంలో బోత్ ఎమ్మెల్యే అనిల్ యాదవ్ మాట్లాడుతూ జాబ్ మేళాకు భారీ స్పందన కనిపించడం ఆశ్చర్యమని మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన జాన్సన్ నాయక్ నిరాశపడకుండా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం అభినందనీయమని అన్నారు. మరో ఎమ్మెల్యే కోవా లక్ష్మి మాట్లాడుతూ తమ నియోజకవర్గంలో కూడా ఈ జాబ్ మేళాలు నిర్వహించి నిరుద్యోగులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.