12-07-2025 08:10:58 PM
కుభీర్ (విజయక్రాంతి): స్మశాన వాటికకు స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ బాకోట్ గ్రామస్తులు రోడ్డెక్కారు. నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని బాకోట్ గ్రామంలో స్మశాన వాటిక లేకపోవడం చేత గ్రామంలో ఎవరైనా కాలం చేస్తే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎంతో కాలంగా నడుస్తూ వస్తున్న సౌనా గ్రామ సమీపంలోని స్మశాన వాటికలోనే బాకోట్ గ్రామస్తులు అంత్యక్రియలు నిర్వహించేవారు. ఇదిలా ఉండగా సౌనా గ్రామాన్ని గత ప్రభుత్వం గ్రామపంచాయతీ చేసింది. దీంతో సౌనా గ్రామస్తులు బాకోట్ గ్రామంలో మృతి చెందిన వారి శవాలను తమ స్మశాన వాటికలోకి తేవద్దని అడ్డుకుంటున్నారు. దీంతో వ్యవసాయ భూములు కలిగిన వారు తమ తమ భూముల్లో అంత్యక్రియలు నిర్వహిస్తుండగా భూములు లేని నిరుపేద కుటుంబాలకు చెందిన వారు ఎవరైనా మృతిచెందితే వారి అంత్యక్రియలు జరిపేందుకు లేని ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
సమస్య పరిష్కరించుకోవాలని బాకోట్ గ్రామస్తులు శనివారం కుభీర్ భైంసా ప్రధాన రహదారిపై ధర్నా చేస్తూ రెండు గంటల పాటు ఆందోళన చేపట్టారు. రహదారి పొడుగునా వాహనాలు ఆగిపోయి ఇబ్బందులు ప్రయాణికులకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. విషయం తెలుసుకున్న కుభీర్ పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళనకారులను సముదాయించారు. రెండవ శనివారం కావున ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఉందని సోమవారం ప్రజా ఫిర్యాదుల విభాగంలో స్మశాన వాటిక కోసం గ్రామస్తులు ఆర్జిని సమర్పించాలని సూచించారు. దీంతో గ్రామస్తులు ఆందోళనను విరమించారు. ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు సమస్యను తీవ్రంగా పరిగణించి బాకోట్ల స్మశాన వాటికకు స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు.