12-12-2024 12:00:00 AM
మానవుడు కనుగొనే ప్రతీ అద్భుతం వెనుకా దాని ప్రతికూల ప్రభావం తప్పక ఉంటుందని సామాజిక శాస్త్రవేత్తలు అంటారు. ప్రకృతిలో పుట్టిన మనిషి ప్రకృతికి దూరంగా జీవించడం ఎప్పుడైతే మొదలుపెట్టాడో అప్పట్నుంచీ తనకు తెలియకుండానే రకరకాల కాలుష్యాల బారిన పడుతున్నాడు. ‘కృత్రిమ పాలిమర్ మిశ్రమం’ (ప్లాస్టిక్) ఎంత అద్భుత పదార్థమో ప్రకృతి పరంగా అదంత రీసైక్లింగ్‌కు వీలు లే(కా)ని విషం కూడా.
ప్లాస్టిక్ వస్తువులు ఏ స్థాయిలో వున్నా వాటి కణాలు మాత్రం జీవుల ఆహారచక్రంలో పొరపాటున కూడా కలవ కూడదు. కానీ, ఏదైతే జరగకూడదని శాస్త్రవేత్తలు భయపడుతున్నారో ఇప్పుడు అదే ప్రపంచం ముంగిట్లోకి వచ్చి పడింది. చాలామంది ప్రపంచ ప్రజలు ఇప్పటికే తమ శరీరంలో మైక్రోప్లాస్టిక్స్ స్థాయిని కలిగి ఉంటున్నారని నిపుణులు ఆందోళనల మధ్య ప్రకటించారు.
ప్లాస్టిక్ కంటైనర్లు, వాటర్ బాటిల్స్, చేపలు వంటి సముద్ర జీవులు, ఇతరత్రా ఆహార పదార్థాలు, జీవుల నుంచి మొదలుకొని పంపు నీటివరకూ కూడా ఎక్కడ చూసినా మైక్రోప్లాస్టిక్స్ (అతిసూక్ష్మ ప్లాస్టిక్ కణాలు) కనిపిస్తున్నట్టు శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. చాలామందికి మన మామూలు కళ్లకు కనిపించని మైక్రోప్లాస్టిక్స్, నానోప్లాస్టిక్స్ (పెద్ద, వాణిజ్య వస్తు సముదాయం నుండి ఉద్భవించే అతిచిన్న ప్లాస్టిక్ కణాలు) వాతావరణంలో మన చుట్టూ వుంటున్న విషయం చాలామందికి తెలియడమే లేదు. గత కొన్నేళ్లుగా ఈ ప్లాస్టిక్స్ కణాలు ప్రజలలో సృష్టిస్తున్న హానికరమైన ప్రభావాల గురించి వారానికో వార్త వెలువడుతున్నది. ఇది సామాన్యులకు ఆందోళన కలిగించే విషయం.
ప్రపంచమంతా ప్లాస్టిక్ మయం
ఇవాళ ప్రపంచమంతా ప్లాస్టిక్ మయమైపోయింది. వాల్ మౌంటెన్ (గోడకు వేళ్లాడదీసే) ఫ్యాన్ రెక్కలు సైతం ఒక రకమైన గట్టి ప్లాస్టిక్‌తోనే తయారవుతు న్నాయి. ఇంకా, అథ్లెటిక్ దుస్తులు, ప్లాస్టిక్ టేకౌట్ కంటైనర్లు, కటింగ్ బోర్డులు కూడా మైక్రోప్లాస్టిక్స్ కణాలను ఉత్పత్తి చేస్తున్నట్టు వారు చెబుతున్నారు. మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీలోని ఫార్మకాలజీ, టాక్సికాలజీ విభాగానికి చెందిన ఒక అసోసియేట్ ప్రొఫెసర్ అభిప్రాయం ప్రకారం, చాలామంది వ్యక్తులు తమ జీర్ణ వ్యవస్థలలో మైక్రోప్లాస్టిక్ కణాలను ఎంతోకొంత స్థాయిని కలిగి ఉంటున్నారు. దురదృష్టకర వాస్తవం కాబట్టి, ఇలాంటి విషయాలకు పెద్దగా ప్రచారం లభించడం లేదని పరిశోధకులు చెబుతున్నారు. మైక్రోప్లాస్టిక్స్ కణాలకు చెందిన పూర్తి దుష్ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి వారు అనేక పరిశోధనలు నిర్వహిస్తున్నారు.
అయితే, అవి అనేకమంది రక్తంలోకి సైతం చేరినట్టు వారు గుర్తించారు. ఈ అతిసూక్ష్మ ప్లాస్టిక్ విషకణాలు మన జీవకణాలు, ఇతరేతర జీవజంతు జాలాలపై చూపే ప్రభావాన్ని కూడా పలువురు శాస్తవేత్తలు తమ అధ్యయనాల ద్వారా పరిశీలించారు. అవి మన జీవకణాలలోకి ప్రవేశించి, వాటిని నాశ నం చేస్తున్నాయని, దాంతో జీవకణాలు మృత్యువాత పడుతున్నాయని పలు పరిశోధనలు తేల్చాయి. అనేకమందిలో క్యాన్స ర్స్, సంతానోత్పత్తి సమస్యలు వంటి దీర్ఘకాలిక అనారోగ్య పరిస్థితులకు ఈ రకమైన మైక్రోప్లాస్టిక్ విషకణాలే కారణమవుతున్నట్టు వారు గుర్తించారు.
తప్పించుకోలేని ముప్పు
మైక్రోప్లాస్టిక్స్ మన చుట్టూ ఎంతగా వ్యాపించాయో తెలిస్తే మనం భయంతో చచ్చిపోతాం. చుట్టూ వీచే గాలిలో, ప్రవహించే నీటిలో కూడా అవి చేరుతున్నా యని శాస్త్రవేత్తలు అంటున్నారు.- సముద్రంలో పట్టుకున్న చేపలద్వారా మైక్రో ప్లాస్టిక్స్ తరచుగా ఆహారచక్రంలోకి ప్రవేశిస్తున్నాయి. ఒక్క సీఫుడ్ మాత్రమే కాదు, రొయ్యలు వంటి జలచరాలు, జీవుల్లో, చేపలలోనూ అధిక మొత్తంలో మైక్రోప్లాస్టిక్స్‌ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. చికెన్ నగ్గెట్స్ (ముక్కలు), ప్లాంట్-బేస్‌డ్ నగ్గెట్స్ ఇతర నాన్ -సీఫుడ్ ప్రొటీన్లు కూడా మైక్రోప్లాస్టిక్స్‌ను కలిగి ఉంటున్నట్టు తేలింది. మైక్రోప్లాస్టిక్స్ జలమార్గాలలోనే కాకుండా గాలిలోనూ కనిపిస్తున్నాయని వారంటున్నారు.
మానవాళికి వాటి నుంచి పూర్తిగా తప్పించుకోవడం అసాధ్యమనే స్థితికి చేరుకున్నామని పరిశోధకులు పేర్కొన్నారు. అలాగే, బట్టల తయారీ సామగ్రి ద్వారా కూడా. ఇలా ఒకటేమిటి, ప్రతిచోటా ఇవి దర్శనమిస్తాయి. “నానో ప్లాస్టిక్స్ కణాలకు ప్రధాన మూలం మన దుస్తులు” అని కూడా శాస్త్రవేత్తలు తెలిపారు. దాదాపు 70% దుస్తుల మెటీరి యల్ వివిధ రకాల ప్లాస్టిక్ పదార్థాలతో తయారు చేయడం జరుగుతున్నదని వారు అన్నారు.
వాటిలో నైలాన్, పాలిస్టర్, యాక్రిలిక్, సింథటిక్ ఫైబర్లు ఉన్నా యి. ఈ వస్త్రాలు తయారు చేసేటప్పుడు, వాటిని లాండ్రీలలో శుభ్రం చేస్తున్నప్పు డు, మనుషులు ధరించేటప్పుడు, ఎండ బెట్టినప్పుడు, అవి చిన్న ప్లాస్టిక్ ఫైబర్లను నీటిలోకి, గాలిలోకి విడుదల చేస్తున్నట్టు వారు కనుగొన్నారు. కాబట్టి, దుస్తులు, పరుపులు, ఇతర కృత్రిమ పదార్థాలు, ఫైబర్ వంటివాటివి కూడా మైక్రోప్లాస్టిక్స్‌ను విడుదల చేస్తున్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మురుగునీటి శుద్ధి కర్మాగారాలలో ఫిల్టర్ చేయడానికి కూడా చిక్క నంత అతిసూక్ష్మస్థాయిలో మైక్రోప్లాస్టిక్స్ ఉంటాయి. కాబట్టే, అవి వాయు, జల మార్గాలలో కంటికి కనిపించకుండా అవి ప్రయాణిస్తున్నట్టు వారు చెబుతున్నారు. అందుకే మనం తినే, తాగే దాదాపు ప్రతి ఆహార పదార్థంలోనూ మీరు మైక్రోప్లాస్టిక్స్ ఉండకుండా చూసుకోవాల్సిన అవ సరం ఎంతైనా ఉందని వారంటున్నారు. కానీ, అదెలా అన్నదే పెద్ద సమస్య. ఈ విషవలయసంలోంచి బయటపడటం కోసం సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ కారక వస్తువులు, ఆహారపదార్థాల వినియోగాన్ని తగ్గించుకోవడమే మన ముందున్న పరిష్కారం. ప్రభుత్వాలు కూడా ఆయా ప్లాస్టిక్ వస్తువుల తయారీ కంపెనీలు నిలిపివేసే విధంగా విధివిధానాలను ప్రకటిం చవలసి ఉంది.
గడీల ఛతప్రతి