11-08-2025 08:50:54 PM
మండల వ్యాప్తంగా రోడ్లు నిర్మాణం చేపట్టాలి..
వెంకటాపురం నూగూరు (విజయక్రాంతి): విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని భారత విద్యార్ధి ఫెడరేషన్(Students Federation of India) మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఆలుబాక కేంద్రంగా రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి.ఎల్. రవి మాట్లాడుతూ, సూరవీడు, ఎదిర, అబ్బాయి గూడెం ప్రాంతాల నుంచి వందలాది మంది విద్యార్థులు ఆలుబాక ప్రభుత్వ పాఠశాలలోకి చదువుకోవడానికి వస్తుంటారని, కానీ పాఠశాల సమయంలో బస్సులు లేక రోజుకు 80 నుంచి 100 రూపాయల వరకు విద్యార్థులకు ఖర్చు అవుతోందన్నారు. పేద విద్యార్థులకు బస్సు సౌకర్యం లేక చదువుకోలేక, ఖర్చులు పెట్టి రాలేకపోతున్నారని అన్నారు. పాఠశాల, కళాశాలల విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
దానితో పాటు మండల వ్యాప్తంగా రోడ్ల నిర్మాణం చేయాలని గత పది రోజుల నుంచి పోరాటాలు చేస్తున్న గాని రోడ్లు వేయకుండా అధికారులు నిమ్మకు నేరెత్తినట్టు చూస్తున్నారని విమర్శించారు. కలిపాక పాఠశాలలో పాఠశాల ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు ఉపాధ్యాయులు లేక విద్యార్థులు చదువులకు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అధికారులకు ఎన్నోసార్లు తెలియజేసిన పట్టి పట్టినట్టు చూస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్య పరిష్కరించకపోతే, సమస్యలు పరిష్కారం అయ్యేవరకు భవిష్యత్తులో పోరాటాలు, దీక్షలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు సోడి అశోక్, జిల్లా కమిటీ సభ్యులు కుమ్మరి నర్సింగరావు, కొరస వంశీ తదితరులు పాల్గొన్నారు.