11-08-2025 08:25:29 PM
అస్తవ్యస్త రోడ్డుతో అవస్థలు
మాజీ జెడ్పిటిసి పాల్వంచ దుర్గ
మణుగూరు (విజయక్రాంతి): మణుగూరు, ఏటూరు నాగారం ప్రధాన రహదారిని పునర్నిర్మించాలని మాజీ జెడ్పిటిసి పాల్వంచ దుర్గ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆమె సోమవారం కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా దుర్గ మాట్లాడుతూ.. ప్రభుత్వం రోడ్ల నిర్మాణానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు ప్రకటిస్తున్నప్పటికీ అవి ప్రకటనలకే పరిమితమవుతున్నాయే తప్ప ఆచరణలో కార్యరూపం దాల్చడం లేదని ఆరోపించారు.
ఇటీవల కురిసిన వర్షాలతో రహదారి మొత్తం గుంతలమయంగా మారిందని, రహదారిపై పయనించే వాహనదారులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని భయంతో ప్రయాణిస్తున్నారని, భారీ గుంతలతో ప్రమాదాలు, ప్రాణనష్టం జరుగుతుందని అత్యవసర సేవలకు అంబులెన్సులు, కూడా వెళ్లలేని దుస్థితి నెలకొందన్నారు. రహదారిని పునర్నిర్మించాలని, అనేకమార్లు అధికారులు, నాయకుల దృష్టికి తెచ్చినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మేడారం జాతర, గోదావరి పుష్కరాలను దృష్టిలో ఈ రహదారి తక్షణమే పునర్నిర్మించి, శాశ్వత ప్రణాళికలో పూర్తి చేయాలని, ప్రమాద ప్రాంతా లలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.