17-11-2025 07:08:06 PM
జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఉప్పులేటి శ్రీనివాస్..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): 6వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన A-Book on Digital Learning లోని సాంఘిక శాస్త్రం, ఆంగ్లం పాఠ్యాంశాలకు సంబంధించిన డిజిటల్ సామర్థ్యాలు, 21వ శతాబ్దపు నైపుణ్యాలను విద్యార్థులకు సమర్థంగా బోధించాలనే లక్ష్యంతో ఒకరోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఉప్పులేటి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం టెక్నాలజీ వినియోగం విస్తృతమైంది. రకరకాల యాపులు, బెట్టింగ్ యాప్లు, ఆన్లైన్ గేములు, తెలియని లింకులను క్లిక్ చేయడం వంటివి సాధారణ పౌరులు మోసాలకు గురయ్యే పరిస్థితులు సృష్టిస్తున్నాయి.
కావున ఉపాధ్యాయులు ఈ అంశాలపై పూర్తి అవగాహన పెంపొందించుకొని, పాఠశాలలో 6–9 తరగతి విద్యార్థులకు A-Book on Digital Learning లోని ప్రతి అంశాన్ని చేరేలా బోధించాలి” అని సూచించారు. ఆంగ్ల ఉపాధ్యాయులు డిజైన్ ఆలోచన (Design Thinking), సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు డిజిటల్ పౌరసత్వం(Digital Citizenship) అంశాలను పాఠ్య ప్రణాళికల ప్రకారం బోధించాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో సాంఘిక శాస్త్ర రిసోర్స్ పర్సన్లు రాజు, విజయేష్, ఆంగ్ల ఉపాధ్యాయులు తులసిరామ్, ఉషన్న, ప్రిన్సిపల్ మహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.