17-11-2025 07:02:52 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): అబద్దాల పునాదులపై ఏర్పడ్డ బిజెపి ప్రభుత్వం దేశంలోని సంపదనంతా కార్పొరేట్ పెట్టుబడిదారి వర్గాలకు దోచిపెడుతుందని, బిజెపి దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య, రాజ్యాంగ, లౌకిక వ్యవస్థ పరిరక్షణ కోసం ఎర్రజెండాలన్నీ ఏకమై పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఐ జాతీయ మాజీ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వందేళ్ళ ఉత్సవాల సందర్భంగా డిసెంబర్ 26న ఖమ్మంలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయడం కోసం ఈనెల 15న జోడే ఘాట్ లో ప్రారంభమైన ప్రచార జాత నేడు కరీంనగర్ కు చేరుకోవడం జరిగింది.
జాతాకు నాయకత్వం వహిస్తున్న సిపిఐ జాతీయ నాయకులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కల్లపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ లతో పాటు జాతాలో వస్తున్న రాష్ట్ర నాయకులకు సిపిఐ కరీంనగర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో పద్మనగర్ లో ఘన స్వాగతం పలికి, పూలమాలలు వేసి ఎర్ర కండువాళ్ళతో స్వాగతం పలికారు.శత జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలని సిపిఐ నాయకులు నినాదాలు చేస్తూ పద్మనగర్ నుండి రాంనగర్, మంకమ్మతోట, గీతాభవన్ చౌరస్తా వరకు సిపిఐ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు.
గీతా భవన్ చౌరస్తా వద్ద పార్టీ శ్రేణులను, ప్రజలనుద్దేశించి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో 1925 డిసెంబర్ 26న కాన్పూర్ లో సిపిఐ ఆవిర్భవించిందని, కార్మికులు, కర్షకులు, ప్రజల పక్షాన నిలబడుతూ పెట్టుబడిదారీ విధానానికి, వర్గ దోపిడీకి వ్యతిరేకంగా సమాజంలో అంతరాలు లేని సమ సమాజ స్థాపన కోసం ఆవిర్భవించిన పార్టీ సిపిఐ అని, వందేళ్లుగా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని దేశ ప్రజానీకానికి బాసటగా నిలుస్తూ, సమస్య ఎక్కడ ఉన్నా అక్కడ ఎర్రజెండా పోరాటాలు నిర్వహిస్తూ ప్రజల పక్షపాతిగా ఉద్యమాలు పోరాటాలు నిర్వహిస్తుందని అన్నారు.
సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కల్లపల్లి శ్రీనివాసరావు,రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందే దేశంలో సిపిఐ ఆవిర్భవించిందని, మార్క్సిజం లెనినిజం సిద్ధాంత పునాదులపై ఏర్పడ్డ సిపిఐ నిరంతరం ప్రజోద్యమాలు నిర్వహిస్తూ ఉందని, 2024 డిసెంబర్ 26 నుండి 2025 డిసెంబర్ 26 వరకు సంవత్సరం పాటు దేశవ్యాప్తంగా వందేళ్ళ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని, ఈ నేపథ్యంలో డిసెంబర్ 26న ఖమ్మంలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని దేశం నలుమూలల నుండి లక్షలాదిమంది తరలి రానున్నారని ఆ బహిరంగ సభను విజయవంతం చేయడం కోసం రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో రాష్ట్ర జాతాలు పర్యటిస్తున్నాయని, కమ్యూనిస్టు శ్రేణులు ఖమ్మంలో బహిరంగ సభకు కమ్యూనిస్టు శ్రేణులు కదలి రావాలని శ్రీనివాసరావు, శంకర్ పిలుపునిచ్చారు.
జాతాలో తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహా,ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి,దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్,రాష్ట్ర నాయకులు రెహ్మాన్,కన్నం లక్ష్మీనారాయణ, సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, అందె స్వామి, జిల్లా కార్యవర్గ, కౌన్సిల్ సభ్యులు కసిరెడ్డి సురేందర్ రెడ్డి,కొయ్యడ సృజన్ కుమార్, బోయిని అశోక్,పిట్టల సమ్మయ్య, పైడిపల్లి రాజు,న్యాలపట్ల రాజు,బీర్ల పద్మ కొట్టే అంజలి,ఉమ్మెంతల రవీందర్ రెడ్డి,కంది రవీందర్ రెడ్డి,బండ రాజిరెడ్డి, మచ్చ రమేష్, బామండ్ల పెల్లి యుగేందర్,పిట్టల శ్రీనివాస్,బూడిద సదాశివ తదితరులు పాల్గొన్నారు.