15-09-2025 01:18:20 AM
-భారీ బందోబస్తు మధ్య ప్రశాంతంగా ముగిసిన ర్యాలీ
-మత పెద్దలను సత్కరించిన సీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్, సిటీ బ్యూరో సెప్టెంబర్ 14 (విజయక్రాంతి): మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని పాతబస్తీలో ముస్లిం సోదరులు ఆదివారం భారీ ఊరేగింపును శాంతియుతంగా నిర్వహించారు. హైద రాబాద్ నగర పోలీసులు చేపట్టిన పటిష్టమైన బందోబస్తు నడుమ ఈ వేడుక ప్రశాం త వాతావరణంలో ముగిసింది. ఈ బందోబస్తు ఏర్పాట్లను నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పర్యవేక్షించి, మత పెద్దలను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా ముస్లింలు ఆదివారం చార్మినార్ పరిసర ప్రాంతాల్లో భక్తిశ్రద్ధలతో ఊరేగింపు నిర్వహించారు. ఈ నేపథ్యంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, వేడుకలు ప్రశాంతంగా సాగేలా హైదరాబాద్ సిటీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఊరేగింపు చార్మినార్ వద్దకు చేరుకోగానే, నగర డీజీ మరియు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ముందుకు వచ్చి ముస్లిం మత పెద్దలైన హాఫేజ్ ముజఫ్ఫర్, సయ్యద్ పాషా తదితరులను పూలమాలలతో సత్కరించి, వారికి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, హైదరాబాద్ నగరానికి ఉన్న గంగా-జమునా తెహజీబ్ మత సామరస్య సంస్కృతి కి ఈ ప్రశాంత ఊరేగింపు ఒక గొప్ప నిదర్శనమని కొనియాడారు. ఊరేగింపును శాంతియుతంగా నిర్వ హించినందుకు మత పెద్దలకు, నిర్వాహకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు సీపీ విక్రమ్ సింగ్ మాన్, దక్షిణ మండల డీసీపీ స్నేహా మెహ్రా న్ ఇతర ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.