15-11-2025 10:56:29 PM
అధికారులను ఆదేశించిన మంత్రి లక్ష్మణ్ కుమార్
భద్రాచలం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని గిరిజన, ఎస్సీ వెల్ఫేర్, గురుకుల, మైనార్టీ వెల్ఫేర్ పాఠశాలలు, వసతి గృహాలలో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థుల పట్ల సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తప్పనిసరిగా ఆ పాఠశాలలను సందర్శించి వారి మానసిక స్థితిగతులను గమనించాలని తెలంగాణ రాష్ట్రం షెడ్యూల్ కులాల అభివృద్ధి, గిరిజన సంక్షేమ, మైనార్టీ సంక్షేమం, వికలాంగులు, సినియర్ పౌరులు, లింగ మార్పిడి సాధికారత శాఖామాత్యులు అడ్లురి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శనివారం ఐటీడీఏ సమావేశం మందిరంలో ఐటీడీఏ ద్వారా ప్రవేశపెడుతున్న వివిధ సంక్షేమ పథకాలపై జిల్లా, యూనిటీ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజులలో ప్రతి ఇన్స్టిట్యూషన్లో విద్యార్థులకు మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రతి పాఠశాలలకు సమస్యలు లేకుండా చూస్తామని, విద్య పరంగా ఎన్ని నిధులైన కేటాయిస్తామని అన్నారు. జెసి, ఆర్డీవో, జిల్లా స్థాయి అధికారి నుండి ప్రతి ఒక్కరూ 15 రోజులకు ఒకసారి తప్పనిసరిగా అన్ని పాఠశాలలను విజిట్ చేసి పిల్లల యొక్క ఆరోగ్య స్థితిగతులను వారి సమస్యలను తెలుసుకొని ప్రతి ఇన్స్టిట్యూషన్లో మెడికల్ క్యాంపులు నిర్వహించేలా చూడాలని అన్నారు. భవిష్యత్తులో ఐటీడీఏలకు రావలసిన అన్ని శాఖల గ్రాంట్లు ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొని పోయి వచ్చేలా చూస్తామని, ఉపాధ్యాయులపరంగా, గిరిజన గ్రామాల రోడ్ల సమస్యలు, అన్ని పాఠశాలల్లో పక్కాభవనాల సమస్యలు, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని అన్నారు.
అంతకుముందు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ నేతృత్వంలో ఐటీడీఏ ద్వారా ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు విద్యా వైద్యం, స్కిల్ డెవలప్మెంట్, కెరీర్ గైడెన్స్, మ్యూజియం అభివృద్ధి, ఉద్దీపకం, ఫారెస్ట్ పోడు భూముల సమస్యలు, గిరిజన గ్రామాలలో ఇంజనీరింగ్ ద్వారా చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు మరియు నెలకొన్న సమస్యల గురించి ఐటీడీఏ పీవో బి రాహుల్ మంత్రి దృష్టికి తీసుకొని పోయారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, ఖమ్మం ఎంపీ రాం సహాయం రెడ్డి, పినపాక ఇల్లందు అశ్వరావుపేట శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, జారే ఆదినారాయణ రెడ్డి, గిరిజన సంక్షేమ అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి, టి సి ఆర్ టి ఐ డైరెక్టర్ సమూజ్వాలా, ట్రై కార్ జిఎం శంకర్రావు మరియు ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.