calender_icon.png 11 July, 2025 | 8:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ కేబినెట్ దేశానికే రోల్ మోడల్: మంత్రి పొంగులేటి

10-07-2025 10:37:16 PM

హైదరాబాద్: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. క్యాబినెట్ భేటి ముగిసిన అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) మీడియాతో మాట్లాడుతూ... దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా 2023 డిసెంబర్ 7న తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 18 మంత్రి మండలి సమావేశాలు నిర్వహించామని, 23 శాఖల్లోని 327 అంశాలను చర్చించి వాటిలో ముఖ్యమైన 321 అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. అవన్నీ కూడా పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకున్న నిర్ణయాలేనని తెలిపారు.

కేబినెట్ ఆమోదం తెలిపిన ఆ అంశాలు ఎంత వరకు అమలయ్యాయి.. ఏ దశలో ఉన్నాయనే విషయాన్ని దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ఈరోజు కేబినెట్ లో 23 శాఖల ప్రిన్సిపల్ సెక్రెటరీల సమక్షంలో అంశాల వారీగా క్షుణంగా చర్చించామని అన్నారు. గత మంత్రి మండలి సమావేశాల్లో ఆమోదించిన అంశాల్లో 96 శాతం ఆర్డర్స్ కూడా జారీ చేసి అమలు జరుగుతున్నాయని, ప్రతి రెండు వారాలకు ఒకసారి కేబినెట్ భేటీ కావాలని, కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలపై ప్రతి మూడు నెలలకొకసారి రివ్యూ చేసుకోవాలని నిర్ణయించడం జరిగిందని అన్నారు. వచ్చే కేబినెట్ భేటీని ఈ నెల 23న నిర్వహించడానికి ఈరోజే నిర్ణయం జరిగిందని, దేశంలోనే ఇలాంటి పద్ధతి అనుసరిస్తున్న మొదటి రాష్ట్రం ఇది అని వెల్లడించారు. 

కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తూ వచ్చిన బీసీ కులగణన చేసి మా పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ చెప్పినట్టుగా తెలంగాణను దేశానికే రోల్ మోడల్ చేశామని, కామారెడ్డి బహిరంగ సభలో ఇచ్చిన హామీ మేరకు కులగణన చేసి, దాని ప్రకారం  బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపామని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పలు సార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలుస్తూ వస్తున్నారని, అయినా కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లుకు ఆమోదం తెలపకుండా పలు మార్లు కొర్రీలు పెట్టి వెనక్కి పంపుతుందని, మేము వాటిని సరిచేస్తూ పంపుతున్నామని అన్నారు.

అయినా ఇప్పటికీ ఆమోదం తెలపకుండా పెండింగ్ లో పెట్టిందని, మరో వైపు  గౌరవ హైకోర్టు స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించిందన్నారు. మేము అడ్వకేట్ జనరల్ న్యాయ సలహాలు తీసుకొని ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలకు వెళ్లాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై గతంలో ఉన్న చట్టాన్ని సవరించాలని కేబినెట్ నిర్ణయించిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన రెండు విద్యాసంస్థలను యూనివర్సిటీలుగా మార్చడానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని, వాటిలో ఒకటి అమితీ కాగా, రెండోది సెయింట్ మేరీస్ రిహాబిలిటేషన్ యూనివర్సిటీ అని, ఇది స్కిల్ యూనివర్సిటీ అని తెలిపారు.

వీటిలో 50 శాతం సీట్లు తెలంగాణ విద్యార్ధులకు కేటాయించడానికి ఆ రెండు యూనివర్సిటీలు అంగీకరించాయన్నారు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 306 గోశాలలు ఉన్నప్పటికీ వాటికి నిర్ధిష్టమైన విధి విధానాలు లేవని, ఆ గోశాలల్లో స్థలం తక్కువ, పశువులు ఎక్కువగా ఉన్నాయన్నారు. గోశాల పాలసీపై కేబినెట్ లో చర్చించామని వివరించారు. గత ప్రభుత్వం వ్యక్తిగత లబ్ధి కోసం పెండింగ్ ప్రాజెక్ట్ లను పూర్తి చేయలేదని, అసంపూర్తిగా మిగిలి ఉన్న ప్రాజెక్ట్ ల కోసం భూసేకరణ చేసి ఆ ప్రాజెక్ట్ లను త్వరగా పూర్తి చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగిందని మంత్రి పొంగులేటి తెలిపారు.