calender_icon.png 4 May, 2025 | 3:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైకల్యం శరీరానికి మాత్రమే.. మనస్సుకు కాదు: మంత్రి సీతక్క

03-05-2025 04:01:45 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): వైకల్యం శరీరానికి మాత్రమే కానీ మనస్సుకు కాదని, దివ్యాంగులు ఆత్మ స్థైర్యంతో ముందడుగు వేయడానికే ఈ సహాయ ఉపకరణాల పంపిణీ చేయడం జరుగుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లో జిల్లా సంక్షేమ అధికారిణి  కే. శిరీష అధ్యక్షతన మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో  జిల్లాలోని వెంకటాపూర్, గోవిందరావుపేట మండలాలకు చెందిన నలుగురు దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్లను అందించేందుకు  ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ... వైకల్యం శరీరానికి మాత్రమేనని మనస్సుకు కాదని, దివ్యాంగులు ఆత్మ స్థైర్యంతో ముందడుగు వేయడానికే ఈ ఉపకరణాలను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. దివ్యాంగులు సకలాంగులకు ఏమాత్రం తీసిపోరని వారు ఇంకా విభిన్న సామర్థ్యాలను కలిగి ఉంటారని కొనియాడారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగానే దివ్యాంగులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో, సంక్షేమ పథకాల్లో రిజర్వేషన్లు ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు.  అలాగే దివ్యాంగులకు ఉపాధి కల్పించడంలో భాగంగా వారికి ఉద్యోగ అవకాశాల కొరకు ఏ ఆఫీసుల చుట్టూ తిరగకుండా నేరుగా వారికోసమే ప్రత్యేకంగా ప్రభుత్వం రూపొందించిన వెబ్ సైట్ లో వివరాలు నమోదు చేసుకుంటే వారి అర్హతలకు తగిన ఉద్యోగం లభించేలా ఏర్పాట్లు చేయడం జరిగిందని స్పష్టం చేశారు.

రానున్న రోజుల్లో ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో దివ్యాంగుల అభివృద్ధి, సంక్షేమ కోసం వారి సాధికారతే లక్ష్యంగా వినూత్న కార్యక్రమాలను రూపొందించడం జరుగుతుందన్నారు. దివ్యాంగుల చేతికి ఊతకర్రలా మన ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని, దివ్యాంగులకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని ఉన్నతంగా ఎదగాలని సీతక్క ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  దివాకర టిఎస్ మాట్లాడుతూ... ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతీ సంక్షేమ పథకంలో దివ్యాంగులకు తొలి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని, జిల్లాలోని దివ్యాంగులకు ప్రభుత్వం ద్వారా అన్ని విధాలుగా సహకారం అందించడం జరుగుతుందన్నారు.  

ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం  ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి చిత్రా మిశ్రా మాట్లాడుతూ... దివ్యాంగులకు మంత్రి సీతక్క  ప్రత్యేక చొరవతో ఈ సహాయ ఉపకరణాలను ఉచితంగా అందించడం ఎంతో గొప్ప విషయం అని, దివ్యాంగులు ఈ సహాయ ఉపకరణాలను సక్రమంగా వినియోగించుకొని తమ వైకల్యాన్ని అధిగమించాలని సూచించారు. అనంతరం వెంకటాపూర్ మండలంలోని ఇంచర్ల గ్రామానికి చెందిన బళ్ల సంజయ్, గోవిందరావుపేట మండలంలోని కర్లపల్లి గ్రామానికి చెందిన నాగయ్య, పసర గ్రామానికి చెందిన కృష్ణ, కందికట్ల సాంబయ్య అనబడే 90% వికలాంగత్వం కలిగిన ఈ  నలుగురు దివ్యాంగులకు  రూ.2 లక్షలు విలువైన బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మహేందర్,  సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్  రవి చందర్, ఇతర శాఖల జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, దివ్యాoగుల సంక్షేమ శాఖ సీనియర్ అసిస్టెంట్ నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు.