11-10-2025 04:55:47 PM
హైదరాబాద్: దేశంలోనే అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డులకెక్కిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తర్వలో ధాన్యం కొనుగోళ్లు కూడా ప్రారంభమవుతాయని, కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా మారినప్పటికీ వరిసాగులో రికార్డు సాధించామని పేర్కొన్నారు. హనుమకొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ... మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టుల నుంచి ఒక్క చుక్క నీరు కూడా ఎత్తిపోయలేదని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలోనే గోదావరి, కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన మండిపడ్డారు. గోదావరి, కృష్ణా జలాల్లో రాష్ట్ర హక్కులు కాపాడేందకు కృషి చేస్తోన్న కాంగ్రెస్ ప్రభుత్వం గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకం అని ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పామని మంత్రి ఉత్తమ్ తెలిపారు.
కర్ణాటకలో ఆల్మట్టి ఎత్తు పెంపును కూడా వ్యతిరేకిస్తున్నామని, కృష్ణా జలాల్లో 511 టీసీఎంలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోవచ్చని, తెలంగాణకు కేవలం 299 టీఎంసీలు చాలని కేసీఆర్ ప్రభుత్వం సంతకాలు చేసిందని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పడు కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి 70 శాతం నీటిని కేటాయించాలని తాము వాదనలు వినిపిస్తున్నామని చెప్పారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమే నిర్మించింది తప్ప కృష్ణా బేసిస్ లో కొత్తగా ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదని మంత్రి వ్యాఖ్యానించారు.